‘సలార్’ సినిమా రెండుసార్లు వాయిదా పడేసరికి… చాలామంది అభిమానులు, సినిమాలు జనాలు అన్నమాట… ‘ఏంటీ ప్రశాంత్ నీల్ అండ్ కో. కి ప్లానింగ్ సరిగ్గా లేదా?’ అని. మీరు ఇలానే అనుకుని ఉంటారు కూడా. ఎందుకంటే సినిమా రిలీజ్ డేట్ చెప్పి… అంతా ఓకే ఇక ఎంజాయ్ చేయడమే తరువాయి అనుకుంటే ‘తూచ్… మేం ఆ ఆ డేట్‌కి రావడం లేదు’ అని ప్రకటించేశారు. ఇప్పుడు డిసెంబరు 22న తీసుకొస్తాం అంటున్నాయి. అయితే ఎంతవరకు నిజం అనే డౌటానుమానం ఇంకా ప్రేక్షకుల్లో ఉంది.
అయితే ప్లానింగ్ లేదు అంటూ విమర్శలు ఎదుర్కొన్న (Salaar) ‘సలార్’ టీమ్ ఇప్పుడు టికెట్ రేటు పెంపు విషయంలో చాలా ముందుస్తుగా ప్లానింగ్‌లో ఉందని చెప్పాలి. ఏంటీ డౌటా? తాజాగా వస్తున్న వార్తల ప్రకారం చూస్తే మీకు అస్సలు డౌట్ రాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే ‘సలార్’ టీమ్ టికెట్ రేట్ల పెంపు కోసం దరఖాస్తు పెట్టుకుందని సమాచారం. పుకార్లు నిజమైతే ఆ దరఖాస్తు ప్రకారం టికెట్ రేట్ల పెంపు పక్కా అని కూడా అంటున్నారు.
నిజానికి ఏపీ ప్రభుత్వం ఒకప్పటిలా కాకుండా… ఇప్పుడు సినిమా వాళ్ల విషయంలో కాస్త చల్లని చూపే చూస్తోంది. కొంచెం స్థాయి ఉన్న సినిమాలకు తొలి వారం అదనపు షోలు వేసుకోవడానికి, రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం ఓకే చెబుతోంది. అయితే దీని కోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పవన్ కల్యాణ్ సినిమాలకు తప్ప మిగిలిన సినిమాలకు ఈ దరఖాస్తులు త్వరగా ఓకే అవుతాయి అని విమర్శ కూడా ఉందనుకోండి. ఆ విషయం పక్కనపెడితే ‘సలార్’ దరఖాస్తు ప్రభుత్వానికి చేరిందట.
సినిమా పరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వం పట్టింపుతో ఉన్న సమయంలో ‘రాధేశ్యామ్’ సినిమాకు కాస్త ఇబ్బందిపడింది. అయితే ‘ఆదిపురుష్’ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఇప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ‘సలార్’ టీమ్ విడుదలకు నెల రోజుల ముందే అప్లికేషన్లు పెట్టేశారట. రూ. 50 నుంచి రూ. 75 వరకు టికెట్ల ధరలు పెంచుకునేలా అవకాశం ఇవ్వండి అనేది ఆ దరఖాస్తుల సారాంశమంట. అలాగే ఐదో షోకు అనుమతి ఇవ్వాలని కూడా కోరారట.