మూడు రోజులకు రూ. 400 కోట్లకుపైగా వసూళ్లు… ఇలాంటి సినిమా రూ. వెయ్యి కోట్లు వసూళ్ల మార్కును చేరడానికి ఎంత టైమ్ పట్టొచ్చు మహా అయితే మరో పది రోజులు అనుకోవచ్చు. కానీ 12 రోజులు గడుస్తున్నా ఇంకా రూ. వెయ్యి కోట్ల పోస్టర్ ఇంకా టీమ్ నుండి రాలేదు. సుమారు రూ. 700 కోట్లు వసూలు చేసింది అని అంటున్నారు. ఇదంతా ‘సలార్’ సినిమా గురించే అని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమానే వసూళ్ల విషయంలో నెమ్మదిగా మందుకెళ్తోంది.
దీంతో అసలు ‘సలార్’ (Salaar) ఎందుకు రూ. 1000 కోట్లు వసూలు చేయలేకపోయింది అనే పోస్ట్ మార్టం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఏం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, ఎవరి ప్లానింగ్‌లో లోపం అంటూ లెక్కలేసేస్తున్నారు. ఈ క్రమంలో మూడు విషయాల్లో పొరపాటు జరగకుండా ఉండుంటే బాగుండేది అని మాట్లాడుతున్నారు. వాటిలో రెండు బాలీవుడ్‌కి చెందినవి అయితే… ఇంకొకటి మొత్తంగా సినిమా టీమ్‌దే.
తొలుత సినిమా టీమ్ సంగతి చూస్తే… ఈ సినిమాకు చేసిన ప్రచారం గురించే అని చెప్పొచ్చు. సినిమా విడుదలకు ముందు కానీ, ఇప్పుడు కానీ ఎలాంటి ప్రచారం చేయలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, పోనీ ఆ తర్వాత సక్సెస్ మీట్ పెడతాం అన్నారు అదీ లేదు. దీంతో సినిమా బజ్ జనాలకు చేరలేదు. ఏవో కంటితుడుపు ఇంటర్వ్యూలు పెట్టి వదిలేశారు. ‘కంటెంట్ ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కర్లేదు’ అంటూ ఏవో లాజిక్‌లు చెప్పారు కానీ. అవి వర్కవుట్ కాలేదు.
ఇక బాలీవుడ్ సంగతికొస్తే… ఈ సినిమాకు తెలుగు ప్రచారం తక్కువైనా ఏదో విధంగా మన హీరో కాబట్టి ఓకే. కానీ బాలీవుడ్‌లో, ఇతర పరిశ్రమల్లో ప్రచారం చేయాలి. హీరో రాకపోయినా టీమ్ అయినా ప్రచారం చేయాల్సింది. ఇది లేకపోయే సరికి జనాలు కూడా లైట్ తీసుకున్నారు. ఆఖరి పాయింట్..‘డంకీ’తో ఈ సినిమా బాలీవుడ్‌లో పోటీ పడలేకపోయింది. షారుఖ్ ఖాన్ లాంటి అగ్ర హీరోను ఢీకొడుతున్నప్పుడు, అందులోనూ అతని గ్రౌండ్ అయిన బాలీవుడ్ ఎదురెళ్తున్నప్పుడు ఆ స్థాయి ప్రచారం కావాలి.
ఇక నార్త్‌లో థియేటర్ల విషయంలో ‘డంకీ’కే ప్రాధాన్యం లభించింది. ఇది కూడా ఇబ్బంది పెట్టే విషయమే. ఇక తమిళం, కన్నడ, మలయాళంలోనూ సినిమాకు ఆశించిన ప్రచారం లేదు, వసూళ్లూ లేవు. ఇవన్నీ లేకపోయేసరికి సినిమాకు వసూళ్ల జోరు తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు రూ. వెయ్యి కోట్ల కోసం వెయిట్ చేయాల్సి వస్తోంది.