కుండపోత వర్షం కేరళను కుదిపేసింది. పోటెత్తిన వరద ముంచేసింది. ఎంతోమంది నిరాశ్రయులు అయ్యారు. ఆర్మీ, పోలీసులు నిద్రాహారాలు మాని ఎంతోమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేరళ వాసుల కష్టాన్ని భారతీయులందరూ తమ కష్టంగా భావించారు. అన్ని విధాలుగా సాయం అందించారు. అలాగే అనేక స్వచ్చంధ సంస్థల వారు కేరళకు వెళ్లి వరద బాధితులకు ఆహారాన్ని అందించారు. వసతులు కల్పించారు. ఇలా సేవ చేసిన వారిలో అక్కినేని సమంత స్థాపించిన “ప్రత్యూష ఫౌండేషన్” వాలంటీర్లు కూడా ఉన్నారు. దాదాపు 10 రోజులుగా కష్టపడి.. కేరళ వరద బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించారు.
ఇంత గొప్ప పని చేసిన తన సంస్థ వాలంటీర్లను సమంత ప్రత్యేకంగా అభినందించింది. ”ప్రియమైన వాలంటీర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, కేరళకి అవరసమైన సామాగ్రిని మీరు దాదాపు 10 రోజులపాటు శ్రమించి బాధితులకు అందించారు. గాడ్ బ్లెస్ యూ” అని సమంత ట్వీట్ చేసింది. అలాగే వారితో కలిసి తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సమంత కొంత సమయం సేవా కార్యక్రమాలకు కేటాయిస్తుంది. ఎంత సంపాదించినప్పటికీ కొంత మొత్తాన్ని చిన్నారుల వైద్యానికి, వారి అభివృద్ధికి అందిస్తుంది. అందుకే సమంతకి దేవుడు అందమైన రూపమే కాదు.. అందమైన మనసును కూడా ఇచ్చారని పలువురు ఆమెను అభినందిస్తుంటారు.