సముద్రఖని… తమిళంలో టాప్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగారు.’నాడోడిగల్’ వంటి హిట్ సినిమాలు తీశారు. తెలుగులో కూడా అదే సినిమాని ‘శంభో శివ శంభో’ గా తీశారు. ఆ తర్వాత నానితో ‘జెండా పై కపిరాజు’ అనే చిత్రాన్ని కూడా తీశారు. అయితే తర్వాత సముద్రఖని తీసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో దర్శకుడిగా సముద్రఖని బ్రేక్ తీసుకున్నారు. అదే టైంలో ‘రఘువరన్ బి.టెక్’ వంటి సినిమాలతో ఆయన నటుడిగా ఎంట్రీ ఇచ్చారు.
అవి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. టాలీవుడ్లో కూడా సముద్రఖని (Samuthirakani) బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఇప్పుడు చాలా వరకు సినిమాల్లో సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ టైంలో ‘వినోదయ సీతమ్’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశారు సముద్రఖని. వాస్తవానికి ఈ చిత్రాన్ని వేరే హీరోతో చేయాలి అనుకున్నారట. కానీ ఏ నటుడు కూడా సముద్రఖని దర్శకత్వంలో నటించడానికి ముందుకు రాలేదు.
దీంతో దొరికిన ఆర్టిస్ట్ లతోనే ఈ చిత్రాన్ని కేవలం 19 రోజుల్లో తీసారట. ఓటీటీలో ఈ చిత్రం నేరుగా రిలీజ్ అయ్యింది. అక్కడ ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. అదే చిత్రాన్ని తెలుగులో ‘బ్రో’ గా తీశారు. అయితే ‘వినోదయ సీతమ్’ కి ఆయన చాలా అడ్జస్ట్ అయ్యి చేయడం జరిగింది. కానీ ‘బ్రో’ కి పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలు దొరకడంతో .. తెలుగులో మనస్ఫూర్తిగా తీశాను అని ఆయన చెప్పుకొచ్చారు.