‘ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్..’ అంటూ ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు సంగీత (Sangeetha). ‘ఖడ్గం’ (Khadgam) సినిమాలో ఆమె నటన, ఆ డైలాగ్ ఎంత ఫేమసో మీకు తెలుసు. అయితే ఆ డైలాగ్, ఆ ఫేమ్ రావాల్సిన హీరోయిన్ వేరొకరు ఉన్నారు. ఆమెనే సాక్షి శివానంద్ (Sakshi Shivanand). హీరోయిన్ కావాలని ఎన్నో ఆశలతో పల్లెటూరి నుండి పట్నం వచ్చిన అమాయకమైన పాత్రలో సంగీత బదులు సాక్షి కనిపించాల్సి ఉందట.
సినిమా మొదలవుతున్న సమయంలో సంగీత చేసిన పాత్రలో.. సాక్షి శివానంద్‌ని సంప్రదించారట. అయితే ఆమె చేయనని చెప్పడంతో ఆ స్థానంలోకి సంగీతను తీసుకొచ్చారట. అమాయకమైన అమ్మాయి పాత్రలో సంగీత అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఆ సినిమా సంగీత కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయింది కూడా. అప్పటికి ఐదేళ్ల క్రితమే సినిమాల్లోకి వచ్చిన సంగీతకు ఆ సినిమాకు మామూలుగా టర్నింగ్ పాయింట్ కాదు.
అనుకున్నట్టే ‘ఖడ్గం’ సినిమా తర్వాత సంగీతకు తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి. ప్రామిసింగ్ హీరోలతో, స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అయితే పెళ్లి చేసుకొని గ్యాప్ ఇచ్చి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో కుర్ర హీరోలకు, హీరోయిన్లకు తల్లిగా, వదినగా కనిపిస్తున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) సినిమాలో రష్మిక (Rashmika Mandanna) తల్లిగా కనిపించిన సంగీత.. ఆ తర్వాత ‘మసూద’ (Masooda) , ‘వరిసు’ / ‘వారసుడు’ (Varisu), ‘తమిళరసన్’ సినిమాల్లో నటించారు.
ఇక సాక్షి శివానంద్ విషయానికొస్తే.. 2010లో ‘రంగ ది దొంగ’ సినిమా తర్వాత మళ్లీ ఇటు రాలేదు. తమిళంలో ‘ఆది భగవాన్’ (2013), కన్నడలో ‘పరమశివ’ (2014) సినిమాలు చేసింది. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. 1997లో ‘మాస్టర్’ (Master) సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం అగ్ర హీరోలతో వరుస సినిమాలుగా సాగింది. ‘ఖడ్గం’ (Khadgam) చేసి ఉంటే ఎలా ఉండేదో మరి. ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడే ‘ఎవరికి రాసి పెట్టి ఉన్న సినిమా వారికి దక్కుతుంది’ అనే మాట అనాల్సి వస్తుంది.