ఇండస్ట్రీలో ప్రతి హిట్ మూవీకి రీమేక్ ఆఫర్స్ రావడం సర్వసాధారణం. తాజాగా వెంకటేష్ (Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) మూవీ కూడా ఈ లిస్ట్‌లో చేరింది. సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ దారిపట్టింది. టాలీవుడ్ లో వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా హిందీలో అక్షయ్ కుమార్ (Akshay Kumar) తో రీమేక్ కానుందని టాక్ నడుస్తోంది.
తెలుగులో అంచనాలకు మించి సక్సెస్ సాధించిన ఈ మూవీ.. రీజినల్ నేటివిటీ, వెంకటేష్ కామెడీ టైమింగ్, ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) గోదావరి యాస, భీమ్స్ (Bheems Ceciroleo) సంగీతం, బాలనటుడు రేవంత్ అట్రాక్షన్ వంటివి కలిపి ఇక్కడ బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ఈ మేజిక్ హిందీలో పునరావృతం అవుతుందా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ముఖ్యంగా అనిల్ రావిపూడి లేకుండా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడం ఎంతవరకు సాధ్యమవుతుందో అనేది అందరిలో ఉత్కంఠ రేపుతోంది.
తెలుగులో ఈ మూవీ హిట్ కావడానికి అనిల్ రావిపూడి కామెడీ పంచ్‌లు, సీన్ల ట్రీట్మెంట్, ఆయన ప్రెజెంట్ చేసిన నేటివిటీ ప్రధాన కారణం. ప్రేక్షకులను ఎంతగా కట్టిపడేస్తుందో కేవలం కథలోనే కాదు, అనిల్ తెరకెక్కించిన ప్రెజెంటేషన్ లోనూ ఉంది. పైగా, ఆయన తీసుకున్న ప్రమోషన్ స్ట్రాటజీ కూడా సినిమాకు అదనపు బూస్ట్ ఇచ్చింది. మరి బాలీవుడ్‌లో ఆ లెవెల్ ఫన్, సీన్స్ కన్‌విన్సింగ్‌గా తెరకెక్కించగలిగే దర్శకుడు ఎవరన్నది మేకర్స్ ముందున్న పెద్ద సవాలు.
ఇటీవల కాలంలో హిందీ చిత్ర పరిశ్రమలో తెలుగు రీమేక్‌లు అంతగా సక్సెస్ కాలేదు. “అల వైకుంఠపురములో” (Ala Vaikunthapurramuloo) రీమేక్ అయిన “షెహజాదా” దారుణంగా ఫెయిల్ అవడం, “ఎఫ్ 2” (F2 Movie) రీమేక్ ప్లాన్స్ ఆగిపోవడం, ఇటువంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందుకే, ఈసారి కూడా ఏ మాత్రం కేర్ తీసుకోకపోతే, మరో ఫ్లాప్ లిస్ట్‌లో ఈ సినిమా కూడా చేరే అవకాశం ఉంది.
మొత్తం మీద, సంక్రాంతి రీమేక్ హిట్ అవ్వాలంటే కేవలం అక్షయ్ కుమార్ స్టార్ పవర్ మాత్రమే కాదు, మరో అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు కూడా అవసరమే. నార్త్ ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టుగా కాంటెంట్ లో మార్పులు, సరైన ప్రొమోషన్ ప్లాన్ ఉంటేనే ఈ సినిమా సక్సెస్ ట్రాక్‌లోకి వస్తుంది. ఇప్పుడు మేకర్స్ ఆ సవాలను ఎలా ఎదుర్కొంటారో.. అనిల్ రావిపూడిని తీసుకువస్తారా లేదా అన్నది చూడాలి.