ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎదురుచూసిన SSMB29 మూవీ చివరకు షూటింగ్ స్టార్ట్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) , , దర్శక ధీరుడు రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీ, భారత సినిమా చరిత్రలోనే మరో బిగ్ రికార్డ్ గా నిలవనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని, ఆ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగానే రాజమౌళి ఓ ప్రత్యేక ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
సాధారణంగా రాజమౌళి సినిమాలకు సంబంధించిన షూటింగ్ మొదలు కావడానికి, ముందే ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, క్యాస్టింగ్ నుంచి టెక్నికల్ టీం వరకు పరిచయం చేస్తూ ఉంటారు. RRR సమయంలో కూడా రాజమౌళి ఇదే రూట్ ఫాలో అయ్యారు. కానీ SSMB29 విషయంలో మాత్రం ఆయన పూర్తిగా సైలెంట్‌గా ఉన్నారు. కానీ ఇప్పుడు, ఫస్ట్ షెడ్యూల్ పూర్తైన వెంటనే, ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గురించి అన్ని వివరాలు చెప్పే సమయమొచ్చినట్లే.
మార్చి మధ్యలో లేదంగే ఏప్రిల్ మొదటి వారంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ డ్రామా అని, కథలో మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టి తిరిగే వ్యక్తిగా కనిపిస్తారని టాక్ ఉన్నా, ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ప్రెస్ మీట్‌లో సినిమా కథా నేపథ్యం, ఇతర కీలక పాత్రలు, హీరోయిన్, ఇంకా ఇతర సాంకేతిక బృందం ఎవరనేది రాజమౌళి స్వయంగా వెల్లడిస్తారని టాక్.
లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం, ఈ ప్రెస్ మీట్ కేవలం సినిమా వివరాలను చెప్పడానికే కాదు, ప్రమోషన్లను కూడా లాంచ్ చేసే స్టేజ్‌గా ఉంటుందని తెలుస్తోంది. కేవలం ఇండియన్ ఆడియన్స్ కాకుండా, ఇంటర్నేషనల్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రెస్ మీట్ గ్లోబల్ మీడియాలోనూ హైలైట్ అవుతుందట. మొత్తానికి, రాజమౌళి అఫిషియల్‌గా మౌనం వీడే సమయం దగ్గర పడింది.