సంక్రాంతి పండుగ హడావుడి ముగిసింది. ఐదు సినిమాలు బరిలో నిలిచిన ఈ క్రేజీ సీజన్ ఇప్పుడు ఒక క్లారిటీకి వచ్చేసింది. నిన్నటితో ఆదివారం సెలవులు కూడా కంప్లీట్ అవ్వడంతో, ఈ రోజు సోమవారం (జనవరి 19) నుండి బాక్సాఫీస్ లెక్కలు కంప్లీట్ గా మారిపోబోతున్నాయి. సెలవుల్లో అన్ని సినిమాలకు ఓపెనింగ్స్ వచ్చినా, ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కేవలం కంటెంట్ ఉన్న సినిమాలే థియేటర్లలో పాగా వేయబోతున్నాయి. దీంతో మేజర్ సెంటర్లలో థియేటర్ల షఫ్లింగ్ ప్రక్రియ మొదలైంది.
ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ రేసులో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 222 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, పండుగ తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవ్వడంతో, సోమవారం నుండి ఈ సినిమాకు మరిన్ని స్క్రీన్స్ కేటాయించేందుకు డిస్ట్రిబ్యూటర్లు మొగ్గు చూపుతున్నారు. మెగాస్టార్ తన బాక్సాఫీస్ స్టామినాతో ఈ సంక్రాంతి టాపర్‌గా నిలిచేలా కనిపిస్తున్నారు.
మరోవైపు యంగ్ హీరోల సినిమాలకు కూడా థియేటర్ల కౌంట్ పెరిగే ఛాన్స్ ఉంది. నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ ఇప్పటికే ‘జాతి రత్నాలు’ ఓవర్సీస్ రికార్డులను బ్రేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. అటు శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాకు మంచి పాజిటివ్ మౌత్ టాక్ వచ్చినా, ఫస్ట్ వీక్ లో థియేటర్ల కొరత వల్ల వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ఇప్పుడు షోలు అడ్జస్ట్ అవుతుండటంతో శర్వానంద్ సినిమా సెకండ్ వీక్ లో కలెక్షన్లు పుంజుకునే అవకాశం పుష్కలంగా ఉంది.
అయితే మిశ్రమ స్పందన వచ్చిన సినిమాలకు మాత్రం ఇప్పుడు అసలైన పరీక్ష మొదలైంది. ప్రభాస్ ‘ది రాజా సాబ్’ భారీ ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ, రెండో వీకెండ్ లో వసూళ్లు గణనీయంగా తగ్గాయి. పది రోజుల్లో సుమారు 196 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం, ఇంకా 200 కోట్ల మార్కును అందుకోవడానికి కష్టపడుతోంది. అటు రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కూడా సెలవుల తర్వాత బాక్సాఫీస్ వద్ద నెమ్మదించింది. ఈ సినిమాల స్థానంలో షోలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. పండుగ రేసులో విన్నర్ ఎవరనేది ఈ రోజుతో తేలిపోతుంది.
