ఓ సినిమా ఆస్కార్ వరకు వెళ్లింది అంటే గొప్ప చిత్రమే. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి డౌట్స్ ఉండవు. ఎన్నో గొప్ప చిత్రాల మధ్య జరిగే పోరులో కొన్ని ఫైనల్ లెవల్‌కి వెళ్తాయి. అలా వెళ్లిన ఓ సినిమా ‘సంతోష్’. అయితే అది మన దేశం నుండి కాదు బ్రిటన్ నుండి. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, ప్రశంసలు దక్కించుకుని యూకే తరఫున ఆస్కార్‌కు అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది ‘సంతోష్’. ఈ సినిమా మన దేశంలో విడుదలయ్యే అవకాశమే లేదు.
‘సంతోష్’ (Santosh) సినిమా విడుదల ఆగిపోయిన విషయం కొన్ని రోజుల క్రితమే బయటకు వచ్చింది. అయితే మన దేశంలో ఈ సినిమా రిలీజ్‌కు ఏర్పడిన ఇబ్బందులపై సినిమా టీమ్ ఆలోచించి మార్పులు చేస్తుందని, అప్పుడు మరోసారి సెన్సార్ సభ్యులు సానుకూల నిర్ణయం తీసుకుంటారు అని అనుకున్నారంతా. చిత్రబృందంతో ఈ విషయమై చర్చించినప్పటికీ తమ సూచనలను టీమ్ స్వీకరించలేదు అని సెన్సార్ సభ్యులు చెప్పారు. దీంతో ఇక సినిమా మన దేశంలో వచ్చే అవకాశం లేదని అర్థమవుతోంది.
సినిమాలోని సన్నివేశాలు, సంభాషణలు సెన్సార్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఇప్పటికే సెన్సార్ బోర్డు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రబృందం రెండుసార్లు రివైజింగ్ కమిటీని సంప్రదించింది కానీ మార్పులకు టీమ్ ముందుకు రాలేదు. ఈ సినిమా సంగతి చూస్తే.. బ్రిటిష్ – ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ సంధ్యా సూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌కు చెందిన సంస్థలు ఈ చిత్రాన్ని (Santosh) నిర్మించాయి.
చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఒక మహిళ జీవితం ఈ సినిమాలో చూడొచ్చు. భర్త మరణం తర్వాత ఆమె పోలీస్‌గా మారడం, ఒక యువతి హత్య కేసు ఛేదించే సమయంలో తనకు ఎదురైన సవాళ్లే ఈ సినిమా. గతేడాది మే నెలలో ఈ చిత్రాన్ని కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఆ తర్వాత మన దేశంలో నిర్వహించిన మామీ ఫిల్మ్ ఫెస్టివల్, ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఆ తర్వాత యూకే తరఫున ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీ ఇచ్చింది. జనవరి 10న ఈ చిత్రాన్ని (Santosh) మన దేశంలో విడుదల చేయాలని అనుకున్నారు.