నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) చిత్రం ఈరోజు.. అనగా ఆగస్టు 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకు ముందు వీరి కాంబినేషన్లో రూపొందిన ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki) సినిమా పాజిటివ్ టాక్ ను రాబట్టుకున్నా, బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేదు. అదీ మరీ క్లాస్ సినిమా కావడం,పైగా ఆ టైంలో వరుసగా పెద్ద సినిమాలు చూసి చూసి ఉన్న ప్రేక్షకులు.. ‘అంటే..’ కి డబ్బులు పెట్టలేకపోయారు.
అయితే ‘అంటే..’ చిత్రాన్ని ఏ ప్రేక్షకులైతే పక్కన పెట్టారో.. వాళ్ళనే ఈసారి థియేటర్ కి రప్పించాలని భావించి దర్శకుడు వివేక్ ఆత్రేయ, హీరో నాని..కలిసి ‘సరిపోదా శనివారం’ చేసినట్లు ఉన్నారు. వారి ప్రయత్నం ఈసారి ఫలించింది. మొదటి షోతోనే సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అయితే ‘సరిపోదా శనివారం’ చిత్రానికి పారితోషికాల రూపంలోనే రూ.50 కోట్లు ఖర్చు అయ్యిందట.
ఈ సినిమా కోసం హీరో నాని రూ.25 కోట్లు పారితోషికం తీసుకున్నాడట. ఇక విలన్ గా చేసిన ఎస్.జె.సూర్య (SJ Suryah) రూ.8 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. ఇక హీరోయిన్ ప్రియాంకతో (Priyanka Mohan) పాటు మిగతా తారాగణం, సాంకేతికవర్గానికి కలుపుకుని రూ.17 కోట్లు బడ్జెట్ అయినట్టు సమాచారం. కేవలం పారితోషికాలకే ఇంత పెడితే.. మరి సినిమా మొత్తానికి ఎంత బడ్జెట్ అయ్యుంటుంది? అనే ప్రశ్న ఇప్పుడు ప్రేక్షకుల్ని వెంటాడుతుంది.