మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి కాగా వచ్చే నెల 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రెగ్యులర్ బయ్యర్లకు ఈ సినిమా హక్కులను ఇస్తున్నారని సమాచారం అందుతోంది. సర్కారు వారి పాట నైజాం హక్కులు 30 కోట్ల రూపాయలు జీఎస్టీ లెక్కన క్లోజ్ అయిందని సమాచారం అందుతోంది.
సర్కారు వారి పాట ఆంధ్ర హక్కులను మాత్రం 50 కోట్ల రూపాయలకు అమ్మాలని నిర్మాతలు భావిస్తున్నట్టు బోగట్టా. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో టికెట్ రేట్లను పెంచడం పెద్ద సినిమాలకు ప్లస్ అవుతోంది. భారీ బడ్జెట్ సినిమాలకు ఏపీ సర్కార్ టికెట్ రేట్లను పెంచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. ఆంధ్రలో రేట్లు పెరగడం వల్లే ఎక్కువ మొత్తానికి ఈ సినిమా హక్కులను విక్రయించాలని నిర్మాతలు భావిస్తున్నారు. రెగ్యులర్ బయ్యర్లు సైతం సినిమా రిజల్ట్ తేడా వస్తే మైత్రీ నిర్మాతలు వెనక్కు ఇస్తారనే నమ్మకం ఉండటంతో అడిగిన స్థాయిలో ఇవ్వడానికి ఓకే చెబుతున్నారని తెలుస్తోంది.
సర్కారు వారి పాట సీడెడ్ హక్కులు ఏ రేటుకు అమ్ముడవుతాయో చూడాల్సి ఉంది. పుష్ప సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా ఆంధ్ర బయ్యర్లు మాత్రం టికెట్ రేట్లు తక్కువగా ఉండటం వల్ల కొంతమేర నష్టపోయారు. సర్కారు వారి పాట సినిమాతో ఆ లెక్కల్ని కూడా నిర్మాతలు సెట్ చేస్తున్నారని తెలుస్తోంది. మహేష్ సర్కారు వారి పాట సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సర్కారు వారి పాట నిర్మాతలకు ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాల్సి ఉంది. కీర్తి సురేష్ కు ఈ సినిమా సక్సెస్ కీలకమని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయనే సంగతి తెలిసిందే.