ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయారాజా పాటల కాపీరైట్ పంచాయితీ ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంది. ఏదో సినిమాలో ఆయన పాట వాడటం, అప్పటికి వారు ఇతరుల నుండి హక్కులు పొందినా.. ఆ విషయం అక్కడితో ఆగకుండా ఇళయరాజా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. దానిపై వాదనలు, ప్రతివాదనలు జరుగుతున్నాయి. కొన్ని రోజులకు తీర్పులు వస్తున్నాయి. ఇవి వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరో కేసు విషయంలో వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సీనియర్ దర్శకుడు ఆర్కే సెల్వమణి సాక్ష్యం ఇచ్చారు.
పాటల కాపీరైట్ కేసులో ఇళయరాజాకు మద్దతుగా దర్శకనిర్మాత ఆర్కే సెల్వమణి కోర్టులో ఇటీవల తన సాక్ష్యం ఇచ్చారు. మ్యూజిక్ మాస్టర్ అనే సంస్థ 2010లో మద్రాసు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఇళయరాజా సంగీతం అందించిన 109 సినిమాల పాటలు, సంగీతంపై హక్కులను ఇళయరాజా భార్య జీవ నిర్వహిస్తున్న సంగీత అనే సంస్థ నుండి తాము తీసుకున్నామని తెలిపారు. తమ అనుమతి లేకుండా ఆ పాటలను సామాజిక మాధ్యమాల్లో ఎవరూ ఉపయోగించకూడదని, నిషేధం విధించాలని ఆ పిటిషన్‌లో కోరారు.

ఈ పిటిషన్ ఇదివరకు ఒకసారి మద్రాసు హైకోర్టులో విచారణకు వచ్చింది. 1997లో చేసుకున్న ఒప్పందం సమయంలో యూట్యూబ్, సోషల్ మీడియాల ప్రస్తావన లేదని, ఆడియో రిలీజ్‌కు మాత్రమే ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఇళయరాజా తరఫున న్యాయవాదాలు వాదించారు. ఇళయరాజా వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఆర్కే సెల్వమణి గురువారం హాజరై సాక్ష్యమై తన వివరణ ఇచ్చారు. ఇళయరాజా తాను సంగీతం అందించిన పాటల కాపీరైట్స్ ఎప్పుడూ నిర్మాతలకు ఇవ్వలేదని, ఆయన వద్దే ఉంచుకున్నారని తెలిపారు.

సినిమాల్లోని పాటలను ఉపయోగించేందుకు సంబంధించిన హక్కు మాత్రమే ఆయా సినిమాల నిర్మాతలకు ఇచ్చినట్లు సెల్వమణి తన సాక్ష్యంలో చెప్పారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం 20కి వాయిదా వేసింది. మరి ఆ రోజు ఏమవుతుందో.. ఇళయరాజా పాట పంచాయితీ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
