టాలీవుడ్‌లో ట్రోలింగ్ అనే పదానికి దగ్గరగా ఉండే నటుల్లో నరేశ్ ఒకరు. ఆయనేం చేసినా ట్రోల్ చేస్తారు, ఆయన కూడా ట్రోలింగ్‌కు గురయ్యే పనులు బాగానే చేస్తుంటారు అంటుంటారు. తాజాగా ఆయన ‘మళ్లీ పెళ్లి’ విషయంలో ట్రోలింగ్ అవుతున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం ఆయన మరో విషయంలో ట్రోల్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి మహేష్ బాబును ఓదార్చారు. ఆ సమయంలో నరేశ్‌ను కేసీఆర్ ఏదో అన్నారంటూ ఓ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై ఇప్పుడు నరేశ్ క్లారిటీ ఇచ్చారు.
ఆ రోజు మహేష్ , కేసీఆర్ కూర్చుని మాట్లాడుతున్నారు. అప్పుడు ఎంపీ సంతోష్ నన్ను పిలిచి ప్రముఖులు చనిపోయినపుడు ప్రభుత్వం తరఫున గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తారు కదా… ఇది సాధారణంగా ఎవరైనా సీఎంకు రికమెండ్ చేస్తేనే ఆయన ఆర్డర్ ఇస్తారు. కానీ స్టేట్ ఆనర్స్ ఇవ్వాలని స్వయంగా కేసీఆర్ గారే చెప్పారు. ఒకసారి మహేష్‌కి ఆ విషయం చెప్పండి అని సంతోష్ నాకు చెప్పారు. ఆ విషయం మహేష్ దగ్గరికి వెళ్లి చెప్తే ‘నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మీరే ఏదైనా చెప్పండి’ అని మహేష్ అన్నాడు అని నరేశ్ తెలిపారు.
దాంతో ఆ విషయం కేసీఆర్ దగ్గరికి వెళ్లి మీకు పాదాభివందనం సర్ అని (Naresh) నరేశ్ ఏదో చెప్పబోయారట. అప్పుడు ఆయన అది నా మనసు నుండి వచ్చింది. కాబట్టి నువ్వు అలా అనొద్దంటూ చేతితో వారించారు. అక్కడ జరిగింది ఇదే అంటూ క్లారిటీ ఇచ్చారు నరేశ్. ఈ విషయం తెలియకుండా ఎవరెవరో ఏదేదో అనుకున్నారు అని నరేశ్ చెప్పుకొచ్చారు. ఆ వీడియో గురించి బయట రకరకాలుగా మాట్లాడుకున్నారు. కేవలం క్లిక్స్ కోసం.. ఇలా చేయడం సరికాదు అని అన్నారాయన.
అయితే ఆయన నిజంగానే ఇలా అన్నారా? ఒకవేళ ఇదే జరిగి ఉంటే ఇన్నాళ్లూ నరేశ్ ఎందుకు ఈ విషయం గురించి ఎక్కడా స్పందించలేదు అనే డౌటానుమానం రావడం సహజం. ఎందుకంటే చిన్న విషయానికి కూడా ఆయన వీడియోలు రిలీజ్ చేసి క్లారిటీ ఇస్తుంటారు.