‘బాహుబలి’ (Baahubali) సినిమాతో ఇండియన్ సినిమా టాలెంట్ ప్రపంచవ్యాప్తంగా చేశారు అని అంటుంటారు కానీ.. అంతుముందు భారతీయ సినిమా నిపుణుల ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేసిన సినిమా ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాకు అభిమానులున్నారు. 2008లో విడుదలైన ఈ సినిమా ఏకంగా ఎనిమిది ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధమైంది అని వార్తలు వస్తున్నాయి. ప్రారంభించిన బ్రిడ్జ్ 7 అనే నిర్మాణ సంస్థ ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ (Slumdog Millionaire) సినిమా సీక్వెల్ హక్కులు పొందింది అని హాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం సినిమా పనులు శరవేగంగా సాగుతున్నాయని కూడా సమాచారం. ఈ సినిమా గురించి దర్శకుడు డానీ బోయల్ మాట్లాడుతూ కొన్ని కథలను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. అలాంటి వాటిల్లో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ (Slumdog Millionaire) ఒకటి అని చెప్పారు. 2008లో వచ్చిన ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముంబయి మురికివాడల్లో నివసించే చిన్నారుల జీవనం, వారిలో ఉండే ప్రతిభను సినిమాలో చూపించారు.
అలాంటి వాతావరణంలో పెరిగిన ఓ బాలుడు తన తెలివితేటలతో కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ. రెండు కోట్లు ఎలా గెలుచుకున్నాడనేది సినిమా కథాంశం. ఈ సినిమా 10 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లలో చోటు దక్కించుకోగా.. 8 విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. నాలుగు గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు కూడా వచ్చాయి. కేవలం అవార్డులేనా అంటే కాదు. 15 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 378 మిలియన్ డాలర్ల వసూళ్లు అందుకుంది.
ఆస్కార్‌లు ఎవరికి వచ్చాయో గుర్తుందిగా.. ఎనిమిది మంది ఆస్కార్ వీరుల్లో మన ఏఆర్ రెహమాన్ (AR Rahman) కూడా ఉన్నారు. బెస్ట్ ఒరిజినల్ స్కోర్‌కిగాను ఆయనకు పురస్కారం దక్కింది. అలాగే ఆయన స్వరపరిచిన ‘జై హో’ పాటకు కూడా అవార్డు వచ్చింది. మరిప్పుడు రెండో పార్టు వస్తే ఇంకెన్ని ఘనతలు అందుకుంటుందో చూడాలి. ఈసారి ఎవరు నటిస్తారు అనేది కూడా ఆసక్తికరమే.