శర్వానంద్ (Sharwanand) నుండి సినిమా వచ్చి ఒకటిన్నరేళ్లు అవుతోంది మీకు తెలుసా? అవును 2022 సెప్టెంబరులో ఆయన సినిమా ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) వచ్చింది. ఆ తర్వాత అతని నుండి ఎలాంటి సినిమా రాలేదు. పోనీ ఏడాదికైనా చేస్తాడు అనుకుంటే చేయలేదు. వ్యక్తిగత కారణాలు, ఇతర కారణాల వల్ల సినిమాలు ఓకే చేయడకుండా పక్కన పెట్టాడు. అయితే ఇప్పుడు గ్యాప్ ఎక్కువైంది అని అనుకుంటున్నాడో ఏమో… వరుసగా ఇప్పుడు లైనప్‌లో నాలుగు సినిమాలు పెట్టాడు. దీంతో శర్వ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అని చెప్పొచ్చు.
శర్వానంద్ కెరీర్ తొలి రోజుల నుండి ఒడుదొడుకులతో సాగుతోంది. ఒక విజయం ఆ తర్వాత వరుస పరాజయాలు ఇలా అవుతూ వస్తోంది. పెద్ద విజయాలు వస్తున్నా… ఆ వెంటనే డిజాస్టర్లు పడుతున్నాయి. అయితే ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో మంచి సినిమా చేశాడు అనే ఘనత సాధించాడు. ఇప్పుడు ‘మనమే’ (Manamey) మరో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చేశాడు. శ్రీరామ్ ఆదిత్య (Sriram Adittya) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. త్వరలో ఈ సినిమాను రిలీజ్ చేస్తారు.
ఈ సినిమా తర్వాత ‘లూజర్’ వెబ్ సిరీస్ దర్శకుడు అభిలాష్ రెడ్డితో ఓ సినిమా ఓకే చేశాడు. అలాగే శ్రీవిష్ణుకు (Sree Vishnu) ‘సామజవరగమన’తో (Samajavaragamana) మంచి విజయం అందించిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మరో సినిమా ఓకే చేశాడు. ఇలా మూడు సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ఓకే చేశాడు అని లేటెస్ట్ టాక్. ‘ఘాజి’ (Ghazi) సినిమాతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy) దర్శకత్వంలో ఓ సినిమా శర్వ చేస్తాడట.
‘ఘాజి’ సినిమా తర్వాత ‘అంతరిక్షం’ (Antariksham 9000 KMPH) సినిమా చేసిన సంకల్ప్… రైన విజయం దక్కక ఇబ్బందిపడ్డారు. అయితే బాలీవుడ్ వెళ్లి విద్యుత్ జమ్వాల్‌తో ‘ఐబీ 71’ (IB71) అనే సినిమా చేశాడు. అది ఓ మోస్తరు స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు తిరిగి టాలీవుడ్ వచ్చేసి శర్వానంద్‌తో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడు.