మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న పెద్ది (Peddi) సినిమా పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో పలు ప్రత్యేకమైన పాత్రలు ఉంటాయని ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చారు. అందులో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) పాత్రకు ఎంతో ప్రత్యేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో పెద్ది చిత్ర అనుభవాలను ఆయన పంచుకున్నారు.
తాను ఈ సినిమాలో తొలిసారి తెలుగులో డైలాగ్ చెప్పానని చెప్పిన శివరాజ్ కుమార్, “నిజంగా తెలుగులో డైలాగ్ చెప్పిన వెంటనే వర్షం పడటం నా జీవితంలో ఒక మరిచిపోలేని అనుభవం. అది ప్రకృతే నన్ను ఆహ్వానించినట్టు అనిపించింది” అంటూ భావోద్వేగంతో చెప్పారు. డైరెక్టర్ బుచ్చిబాబు ఎంతో పొగడ్తలతో మెచ్చుకున్న ఆయన.. తన షాట్‌పై ఇచ్చిన ప్రశంసలు ఎప్పటికీ గుర్తుంటాయని అన్నారు. రామ్ చరణ్ మీద కూడా శివరాజ్ కుమార్ మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
“చరణ్ చాలా డౌన్ టు ఎర్త్. అతడి ప్రేమ, ప్రొఫెషనల్ అప్రోచ్ నాకు బాగా నచ్చింది” అన్నారు. సెట్స్‌పై వాతావరణం ఎంత ఫ్రెండ్లీగా ఉందో, టీమ్ అందరూ ఎంత సహాయంగా ఉన్నారో ప్రస్తావించారు. అలాగే హైదరాబాదీ బిర్యానీ తనకు ప్రత్యేకంగా నచ్చిందంటూ చిరునవ్వుతో చెప్పారు. తన పాత్ర గురించి చెప్పిన శివరాజ్, “ఈ సినిమాలో నా పాత్ర చాలా స్పెషల్. ఎమోషన్‌తో నిండిన క్యారెక్టర్. స్క్రిప్ట్ మొదటి నుండి నాకు బాగా నచ్చింది.
ప్రేక్షకుల హృదయాలను స్పర్శించగల పాత్ర ఇదని నమ్మకం ఉంది” అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పెద్ది సినిమా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ (Sukumar) రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్నది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ (R. Rathnavelu) సంగీతం అందిస్తున్నారు. జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమా 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.