టాలీవుడ్‌లో సంక్రాంతి తర్వాత ఆ స్థాయిలో కాకపోయినా… చిన్నపాటి సీజన్ అంటే శివరాత్రి అనే చెప్పాలి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో చిన్న చిన్న సీజన్లకు కూడా సినిమాలు వరుస కడుతున్నాయి. అందులో పెద్ద సినిమాలూ ఉంటున్నాయి. అలా ఈ నెలాఖరుకు శివరాత్రి సీజన్ ఉంటోంది. దీంతో ఈ సారి ఏం సినిమాలు వస్తాయి అనే లెక్కలు మొదలయ్యాయి. కారణం ఈ శివరాత్రి సందర్భంగా వచ్చే స్పెషల్ డేట్ ఫిబ్రవరి 25. ఆ రోజున రిలీజ్‌కు ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. కానీ ఏవీ ఫైనల్ కాలేదు.
తొలుత విడుదల చేసిన తేదీల ప్రకారం చూసుకుంటే… ఫిబ్రవరి 25కి ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అవ్వాలి. అయితే రిలీజ్ డేట్ విషయంలో టీమ్‌కి ఇంకా క్లారిటీ రాలేదు. మొన్నీమధ్యే అయితే ఫిబ్రవరి 25 లేదంటే ఏప్రిల్ 1 అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు కుదుటపడి, టికెట్ ధరల సంగతి తేలితే సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారని టాక్. మరోవైపుద నైట్ కర్ఫ్యూ, 50 శాతం సీటింగ్ నిబంధన లాంటివి ఉంటే వసూళ్ల విషయంలో ఇబ్బంది అనేది వారి ఆలోచన. అయితే ఇవి ఎప్పటికి తేలుతాయో తెలియడం లేదు.
ఆ సినిమా సంగతి పక్కనపెడితే… ఆ రోజు రిలీజ్ చేయడానికి ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’, ‘సెబాస్టియన్’ రెడీగా ఉన్నాయి. శర్వానంద్, రష్మిక మందనా కాంబినేషన్‌లో రూపొందిన ‘ఆడాళ్లూ మీకు జోహార్లూ’కి మంచి బజ్ ఉంది. ఇక కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్’ కూడా ఆసక్తికరంగానే ఉంది. ఈ రెండూ కాకుండా అజిత్ ‘వలిమై’ కూడా ఫిబ్రవరి 25నే విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఈ మూడింటితోపాటు వరుణ్‌తేజ్ ‘గని’ కూడా రంగంలోకి వచ్చింది.
డిసెంబరులో విడుదల కావాల్సిన ‘గని’… ‘అఖంఢ’, ‘శ్యామ్ సింగ రాయ్’ కోసం త్యాగాలు చేసి డేట్స్ మార్చుకుంది. ఆ తర్వాత డేట్ దొరకలేదు. కానీ ఇటీవల అయితే ఫిబ్రవరి 25 లేదంటే మార్చి 4 అంటూ డేట్ చెప్పారు. ఇప్పుడు అందులో తొలి డేట్‌కు ఫిక్స్ అవుదాం అనుకుంటున్నారట. దీనిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది అంటున్నారు. ఒకవేళ ‘గని’ రాకపోతే శివరాత్రికి మూడు సినిమాలుంటాయి. వస్తే నాలుగు అవుతాయి. కాబట్టి మూడు ముక్కలాటనా లేక నాలుగు స్తంభాలాలటనా అనేది తేలాలి. అయితే ‘భీమ్లా నాయక్’ వచ్చేస్తా అంటే సింగిల్ మ్యాన్ షోనే ఉంటుంది.