ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఎడిటింగ్ పనిని పెద్దగా అనుభవం లేని కుర్రాడి చేతిలో పెట్టారు అంటే అతనికి టాలెంట్ ఎంత ఉండాలి. ఇది ఓ యాంగిల్. ఇప్పుడు ఇంకో యాంగిల్ చూద్దాం. ప్రపంచం మొత్తం ఎలా ఉంటుందా అని ఎదురుచూస్తున్న సినిమాను పెద్దగా అనుభవం లేకుండా హ్యాండిల్ చేయాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి. ఈ రెండు యాంగిల్స్‌లో ఆ నమ్మకం, టాలెంట్ ఉన్న కుర్రాడు ఉజ్వల్ కులకర్ణి. ఇక ఆ సినిమా ‘కేజీయఫ్ 2’.
ఇప్పుడు ఆ కుర్రాడి గురించే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం. ‘కేజీయఫ్ 1’కి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్ 2’ వచ్చింది. తొలి సినిమా స్థాయిలో ఉండాలి. ఇంకా చెప్పాలంటే అంతకుమించి ఉండాలి. సినిమా ప్రేక్షకులకు మాట ఇది. అలాంటి సినిమా ఎడిటింగ్ పనిని 19 ఏళ్ల కుర్రాడి చేతిలో పెట్టేశారు అని తెలిశాక అభిమానుల్లో ఎక్కడో చిన్న భయం. కానీ సినిమా వచ్చాక చూస్తే అదరగొట్టేశారు. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా పర్‌ఫెక్ట్‌గా కట్ చేశారు. ఎలివేషన్లు బాగా వచ్చేలా చూసుకున్నారు.
సినిమాలో ఏ సన్నివేశం ఎక్కడ ఉండాలి? వరస క్రమం ఎలా ఉండాలి? అనవసర సన్నివేశాల తొలగింపు.. ఇలా చాలా పనులే చూసుకోవాలి ఎడిటర్. ముందుగా చెప్పినట్లు ‘కేజీయఫ్ 2’కి ఈ పని చేసింది ఉజ్వల్ కులకర్ణి. ‘కేజీయఫ్’ విడుదలయ్యే సమయానికి ఉజ్వల్ పీయూసీ చదువుతున్నాడు. అప్పటికే కొన్ని షార్ట్ ఫిల్స్మ్‌లకు ఎడిటింగ్ చేశాడు. సినిమాలపై ఆసక్తిని గమనించిన ఉజ్వల్ సోదరుడు ‘నువ్వు చదువు ఆపేసి సినీ పరిశ్రమకు వెళ్లు’ అని ప్రోత్సహించాడట.
ఆ సయమంలోనే కొత్తతరానికి అవకాశాలు ఇవ్వాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఉజ్వల్ చేసిన ఫ్యాన్ ఎడిట్ వీడియోలను ప్రశాంత్ చూశారు. కుర్రాడి ప్రతిభ నచ్చి ‘కేజీఎఫ్ 2’ ఎడిటింగ్ అవకాశాన్ని ఇచ్చాడు. దర్శకుడు పెట్టుకున్న ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు ఉజ్వల్. సినిమాలో అతని పని తనానికి మంచి పేరు వస్తోంది. చూస్తుంటే ఈ కుర్రాడు ఇంకా ఎన్ని ఘనతలు సాధిస్తాడో.