మహేష్ బాబు కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో మురారి సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబు అభిమానులకు ఎంతగానో నచ్చేసింది. ఎనిమిది కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఎన్. రామలింగేశ్వరరావు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. సినిమా విడుదలైన సమయంలో కలెక్షన్లు డల్ గా ఉన్నా మూడో వారం నుంచి కలెక్షన్లు పుంజుకున్నాయి.
ఎన్. రామలింగేశ్వరరావు మహేష్ బాబు కెరీర్ ను నిలబెట్టే సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనతో ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఈ నిర్మాత సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమాని కావడంతో పాటు కృష్ణతో పలు సినిమాలను నిర్మించి ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ సినిమాలో వసుంధరా దాస్ ను ఎంపిక చేయాలని కృష్ణవంశీ భావించారు. అయితే నిర్మాత సోనాలి బింద్రేను ఎంపిక చేయాలని సూచించడంతో దర్శకుడు కృష్ణవంశీ అందుకు అంగీకరించారు.
ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా నిర్మాత భారీ మొత్తం ఖర్చు చేశారు. అయితే ఈ సినిమా 100 రోజుల వేడుక జరగకపోవడానికి కృష్ణవంశీకి, నిర్మాతకు మధ్య ఏర్పడిన బేధాభిప్రాయాలు కారణం కావడం గమనార్హం. 2001 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ బాబు అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత కాలంలో మహేష్ బాబు మరెన్నో విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాపై దృష్టి పెట్టారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ కానుండగా ఈ సినిమా కూడా సంచలన విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది.