సీనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి. ఆ విజయాలను సొంతం చేసుకోవడానికి ఎన్టీఆర్ పడిన కష్టం అంతాఇంతా కాదు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా వేర్వేరు రంగాలలో సీనియర్ ఎన్టీఆర్ సత్తా చాటారు. అయితే రాజకీయాల్లోకి వచ్చే సమయానికి సీనియర్ ఎన్టీఆర్ పారితోషికం 10 లక్షల రూపాయలు అని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో రజనీకాంత్ వెల్లడించారు. అప్పట్లో 10 లక్షలు అంటే ఇప్పుడు 100 కోట్ల రూపాయలకు సమానం అని చెప్పవచ్చు.
(Sr NTR) సీనియర్ ఎన్టీఆర్ ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ ను వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారని తెలుగు ఆత్మగౌరవం పేరుతో రాష్ట్రమంతా తిరిగారని రజనీకాంత్ కామెంట్లు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ యుగ పురుషుడు అని పార్టీ ప్రారంభించిన 9 నెలల్లోనే రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాడని రజనీకాంత్ పేర్కొన్నారు. 1963లో సీనియర్ ఎన్టీఆర్ ను తొలిసారి చూశానని రజనీకాంత్ కామెంట్లు చేశారు. నాకు 13 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో ఎన్టీఆర్, అంజలి, రేలంగి మినర్వా థియేటర్ కు వచ్చారని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.
శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో దుర్యోధనుని పాత్రలో ఎన్టీఆర్ ను చూసిన సమయంలో మెస్మరైజ్ అయ్యానని ఆయన కామెంట్లు చేశారు. ఆ సినిమాలోని డైలాగ్స్ వల్లే తాను తెలుగు నేర్చుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. రజనీకాంత్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కొన్ని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
అందువల్ల కొంతమంది వైసీపీ నేతలు రజనీకాంత్ టార్గెట్ గా కామెంట్లు చేస్తున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.