నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్. ఈ చిత్రంలో నాని కి పోటీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. గ్లామర్, రొమాన్స్ తో పాటు ఒక సగటు ఇల్లాలుగా ఈ చిత్రంలో నటించిన శ్రద్ధా పై ప్రశంసలు కురిసాయి. ఇక ప్రస్తుతం ‘నేర్కొండ పార్వాయ్’ అనే తమిళ చిత్రంలో నటించింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ చిత్రానికి ఇది రీమేక్. తమిళంలో అజిత్ హీరోగా ఈ రీమేక్ రూపొందుతుంది. ఈ చిత్రంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఓ యువతి పాత్రలో శ్రద్ద శ్రీనాథ్ నటించింది. హిందీలో తాప్సీ చేసిన పాత్రని శ్రద్దా చేస్తుంది. ఇక ఈ పాత్రలో నటిస్తున్నప్పుడు తన అనుభవాలు ఎలా ఉన్నాయనేది .. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
శ్రద్ద శ్రీనాథ్ మాట్లాడుతూ… “మహిళల పై జరుగుతున్న లైంగిక వేధింపుల పై సరికొత్త విప్లవం రావాలి. దీనికి మీటూ ఒక్కటే సరిపోదు.ఈ ఒక్క ఉద్యమం… సెక్సువల్ హరాస్మెంట్ లను తగ్గించలేదు, ప్రతీ ఒక్క సెలబ్రిటీ నోరు విప్పితే గానీ, కీచకుల ఆట కట్టించలేము. అప్పుడే సమాజంలో సరైన మార్పు వస్తుంది. ‘నేర్కొండ పార్వాయ్’ సినిమాలో ఆ పాత్రలో భాగంగా నాపై లైంగిక వేధింపులు జరుగుతాయి. ఆ సమయంలో నాకు నిర్భయకు సంబందించిన ఆలోచనలే మెదడులో మెదిలాయి. ఆమె ఎంత నరకం అనుభవించి ఉంటుంది? రాక్షకుల నుండీ తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటుంది? ఇలాంటి ఆలోచనలతో సతమతమయ్యాను. ఏ అమ్మాయైనా తన పై లైంగిక దాడి జరిగిందని చెప్పగానే.. ఎలా జరిగింది? అన్నట్లుగా ఆమెనే ప్రశ్నిస్తారు తప్ప నిందితులను మాత్రం ఒక్క మాట కూడా అనరు. అందుకే భయపడి ఎవ్వరూ ముందుకు వచ్చి ఇలాంటి సంఘటనలు చెప్పడం లేదు. ప్రస్తుత సమాజంలో లైంగిక వేధింపులంటే నవ్వులాటగా మారింది. దీని పై పార్టీల్లో జోకులేసుకునే స్థాయికి దిగజారింది పరిస్థితి” అంటూ చాలా ఘాటుగా చెప్పుకొచ్చింది.