హాలీవుడ్ సినిమాలకు మన భారతీయ హీరోలు గొంతు అరువు ఇవ్వడం గతంలో చాలాసార్లు చూశాం. పెద్ద హీరోలు, నటులు సైతం ఈ పని చేశారు. అయితే ఇప్పుడు టీమిండియా యువ బ్యాటర్ ఆ పని చూశాడు. చూడటానికి హీరోలా ఉంటావు అంటూ అభిమానులు అతనిని పొగుడుతుంటే.. ఆయన మాత్రం ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఐపీఎల్ సీజన్‌లో అదరగొడుతున్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ ఇప్పుడు తన వాయిస్‌తోనూ అదే స్టైల్‌లో దుమ్ముదులిపేస్తున్నాడు.
ఈ మేరకు శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హాలీవుడ్ యానిమేషన్ చిత్రంలోని స్పైడర్ మ్యాన్ పాత్రకు గిల్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారాడు. అందులో ఇండియన్ స్పైడర్‌మ్యాన్ (Indian Spider-Man) పాత్రకు గిల్ తన గాత్రాన్ని అందించాడు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం అధికారికంగా వెల్లడించింది. హాలీవుడ్ యానిమేషన్ చిత్రం ‘స్పైడర్ మ్యాన్: అక్రాస్ ది స్పైడర్ వర్స్’ను సోనీ పిక్చర్ భారత్‌లో విడుదల చేస్తోంది.
భారత స్పైడర్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న పవిత్ర ప్రభాకర్ ఇందులో తొలిసారిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఆ పాత్రకు హిందీ, పంజాబీ భాషల్లో శుభ్‌మన్ గిల్ డబ్బింగ్ చెప్పాడు. హాలీవుడ్ ఫ్రాంఛైజీలకు చెందిన ఓ సినిమాలో ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పిన తొలి క్రీడాకారుడు శుభ్‌మన్ గిల్ కావడం విశేషం. ‘శుభ్‌మన్.. ఇక స్పైడర్‌మ్యాన్’ అంటూ టీమ్ ఘనంగా అనౌన్స్ చేసింది కూడా.
2018లో విడుదలైన ‘స్పైడర్ మ్యాన్ : ఇన్‌టు ది స్పైడర్ వెర్స్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘స్పైడర్ మ్యాన్: అక్రాస్ ది స్పైడర్ వెర్స్’ను రూపొందించారు. జూన్ 2న ఈ సినిమా తెలుగు సహా ఇంగ్లిష్, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ తదితర 10 భాషల్లో విడుదల చేయనున్నారు. ఇతర భాషల్లోనూ ఇలానే ప్రముఖులతో డబ్బింగ్ చెప్పిస్తున్నారని సమాచారం.