మొదటి పాన్ ఇండియా నటి గురించి చెప్పుకోవాలి అంటే.. సిల్క్ స్మిత గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఆరోజుల్లోనే ఆమె తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నటించేసి సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. 1980, 90 ల కాలంలో ఈమె గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదేమో. ఈమె ఏ సినిమాలో అయినా ఓ పాట చేస్తుంది అంటే ఎగబడి థియేటర్ కు వెళ్లే జనాలు కూడా ఉన్నారు.
కేవలం సిల్క్ స్మిత (Silk Smitha) క్రేజ్ తోనే గట్టెక్కిన భారీ బిజినెస్ చేసిన సినిమాలు ఉన్నాయి. ఆమె వల్ల చాలా మంది నిర్మాతలు గట్టెక్కేశారు. అయితే ఏమైందో ఏమో కేవలం 35 ఏళ్ల వయసులోనే ఈమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. సిల్క్ స్మిత బలవన్మరణానికి కారణాలు ఏంటి అనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీ. ఇదిలా ఉండగా.. సిల్క్ స్మిత గురించి ఇప్పటికీ అందరికీ అన్ని విషయాలు తెలీవు అంటే కూడా అతిశయోక్తి అనిపించుకోదేమో.
ఆమె అసలు పేరు విజయలక్ష్మి అని చాలా తక్కువ మందికే తెలుసు. అలాగే కెరీర్ ప్రారంభంలో ఆమె ఓ హీరోయిన్ ఇంట్లో పనిమనిషిగా చేసిందట. అవును.. సిల్క్ స్మిత సినీ పరిశ్రమలో అడుగుపెట్టక ముందు ఓ నటి ఇంట్లో పనిమనిషిగా చేసిందట. ఈ విషయం చాలా మందికి తెలీదు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గతంలో పూర్ణ అనే ఒక హీరోయిన్ ఉండేది. ఆమె ఇంట్లోనే సిల్క్ స్మిత పని చేసేదట.
ఓ రోజు ఆ హీరోయిన్ ని కలవడానికి వచ్చిన డైరెక్టర్.. సిల్క్ స్మితని తన సినిమాలోకి వ్యాంప్ పాత్ర కోసం తీసుకున్నాడట.ఆ టైంలో అతను చేసే సినిమాకి బడ్జెట్ సమస్యలు ఉండటం, అలాగే ఆ పాత్ర కోసం సంప్రదించిన పేరుగాంచిన నటీమణులు నిరాకరించడంతో ఆ పాత్రకి సిల్క్ స్మితని ఎంపిక చేసుకున్నాడట ఆ దర్శకుడు. ఆ విధంగా సిల్క్ స్మిత సినీ జీవితం మొదలైంది. తర్వాతి సంగతి అందరికీ తెలిసిందే.