సెలబ్రిటీలు పబ్లిక్ ప్లేస్‌లోకి వచ్చినప్పుడు దాదాపుగా అందరూ ప్రైవేట్ సెక్యూరిటీ సాయం తీసుకుంటారు. ప్రేక్షకులు, అభిమానుల తాకిడి తట్టుకోవడం చాలా కష్టం. పోలీసు భద్రత ఉన్నప్పటికీ కార్ దిగి, కార్యక్రమం ముగించుకుని కార్ ఎక్కేవరకు అంటిపెట్టుకుని ఉండే బౌన్సర్ల మీదే ఆధారపడుతుంటారు స్టార్స్. కొన్నిసార్లు బౌన్సర్లు వేదిక మీద ఉండడం తప్పనిసరి అవుతుంది. హీరోలు మాట్లాడుతుండగానే.. సడెన్‌గా వచ్చి సెల్ఫీలు తీసుకోవడం, కాళ్ల మీద పడిపోవడం అనే ట్రెండ్ ఆమధ్య కొన్నాళ్లు నడిచింది.
దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు భారీ భద్రత ఏర్పాటు చేయడం అనేది తప్పనిసరి అయిపోయింది. తాజాగా స్టార్ సింగర్ కైలాష్ ఖేర్ మీద ఈవెంట్ జరుగుతున్న వేదికపై దాడి జరగడం ఫిలిం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. పాపులర్ సింగర్ కైలాష్ ఖేర్ గురించి కొత్తగా పరిచయం చెయ్యనక్కర్లేదు.. తెలుగులో ప్రభాస్ ‘మిర్చి’ మూవీలో ‘పండగలా దిగి వచ్చావు’ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పరుగు’, ‘గోపాల గోపాల’, ‘భరత్ అనే నేను’ వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడి అలరించారు.
దాదాపు స్టార్ హీరోలందరికీ పాడారాయన. అలాగే ‘బాహుబలి’ హిందీ, తమిళ్ వెర్షన్లకు కూడా పాడారు. తన గొంతుకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి కైలాష్ మీద దాడి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక ప్రభుత్వం ఏటా నిర్వహించే ‘హంపి ఉత్సవాలు’ ఈసారి కూడా ఘనంగా జరిగాయి. జనవరి 27 నుంచి 29 వరకు జరిగిన ఈ వేడుకల్లో భారీగా ప్రజలు పాల్గొన్నారు. కైలాష్ ఖేర్ పలు హిందీ పాటలతో అలరించారు.
అయితే తమకు కన్నడ సాంగ్స్ మాత్రమే కావాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు యువకులు స్టేజ్‌పైనున్న ఉన్న కైలాష్ ఖేర్ మీదకు వాటర్ బాటిల్స్ విసిరేశారు. ఊహించని ఈ పరిణామానికి అంతా కంగుతిన్నారు. సమాచారమందుకున్నస్థానిక పోలీసులు దాడికి పాల్పడిన ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.