కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా ప్రాచుర్యం పొందిన శ్రీవిష్ణు టైటిల్ రోల్ ప్లే చేసిన తాజా చిత్రం “#సింగిల్” (#Single). “నిను వీడని నీడను నేనే”తో దర్శకుడిగా మెప్పించిన కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించగా.. ప్రమోషనల్ కంటెంట్ మంచి ఆసక్తి నెలకొల్పింది. మరి సినిమా ఏ స్థాయిలో ఉందో చూద్దాం..!!
కథ: బ్యాంకులో మంచి ఉద్యోగం, జీతం ఉన్నా ఎందుకో సింగిల్ గానే ఉండిపోయాడు విజయ్ (శ్రీవిష్ణు). ఆడి షోరూం లో సేల్స్ గర్ల్ గా వర్క్ చేసే పూర్వ (కేతిక శర్మ)ను ప్రేమిస్తాడు. కానీ.. విజయ్ ను హరిణి (ఇవాన) ప్రేమిస్తుంది.
ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎవరి ప్రేమ గెలిచింది? ఈ ప్రేమకథలో తలెత్తిన ఇబ్బందులు ఏమిటి? చివరికి విజయ్ సింగిల్ గా మిగిలిపోయాడా? లేక మింగిల్ అయ్యాడా? అనేది “సింగిల్” (#Single) సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్క్స్, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ లాంటివి ఏమీ లేవు. అన్ని పాత్రలు సరదాగా నవ్వించడానికి ప్రయత్నిస్తాయి.
శ్రీవిష్ణు ఎప్పట్లానే తన సింగిల్ లైన్ పంచ్ డైలాగులతో ఎంటర్ టైన్ చేసాడు. కొన్ని డబుల్ మీనింగ్ పంచులు మాత్రం అవసరం లేదు అనిపించింది. శ్రీవిష్ణు ఇమేజ్ తో సంబంధం లేకుండా “పునుగులు, బర్గర్లు” అనే డైలాగ్ మాత్రం పెట్టకుండా ఉండాల్సింది. సినిమాలో చాలా ద్వంద్వార్థాలు ఉన్నప్పటికీ.. ఇదొక్కటి మాత్రం వెగటుగా అనిపించింది.
కేతిక శర్మ ఎమోషనల్ సీన్స్ లో నటించడానికి ప్రయత్నించింది. ఇవాన హావభావాలు చాలా చక్కగా పండించగలదు. ఈ చిత్రంలోనూ హరిణి అనే పాత్రలో ఆమె చాలా హుందాగా, ఎనర్జిటిక్ గా ఆకట్టుకుంది.
వెన్నెల కిషోర్ కు “సారంగపాణి జాతకం” తర్వాత మరో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పడింది. కామెడీ టైమింగ్ & బాడీ లాంగ్వేజ్ తో హిలేరియస్ గా ఎంటర్టైన్ చేశాడు. శ్రీవిష్ణుతో కిషోర్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.
రాజేంద్రప్రసాద్ చిన్న అతిథి పాత్రలో కాస్త సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారు. విటివి గణేష్, ప్రభాస్ శ్రీను తదితరులు అక్కడక్కడా నవ్వించారు.
సాంకేతికవర్గం పనితీరు: తమిళంలో వెటరన్ సినిమాటోగ్రాఫర్ గా పేర్కొనే వేల్ రాజ్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. ఆయన స్థాయి మేకింగ్ స్టైల్ కానీ, ఆయన మార్క్ కానీ ఎక్కడా కనిపించలేదు. క్వాలిటీ విషయంలో మాత్రం ప్రొడక్షన్ & ఆర్ట్ వర్క్ టీమ్ ఎక్కడా రాజీపడలేదు.
విశాల్ చంద్రశేఖర్ సంగీతం వినసొంపుగా ఉంది. మరి ఆ పాటల్ని ఎందుకు సరిగా పబ్లిసిటీ చేసుకోలేదో అర్థం కాలేదు. నేపథ్య సంగీతం కూడా ఎమోషన్ & కామెడీని ఎలివేట్ చేసింది.
భాను & నందు సమకూర్చిన డైలాగులు హిలేరియస్ గా పేలాయి. ముఖ్యంగా స్టార్ హీరోల పాపులర్ డైలాగ్స్ & మీమ్స్ ను వినియోగించుకున్న తీరు ఆడియన్స్ ను కచ్చితంగా అలరిస్తుంది.
దర్శకుడు కార్తీక్ రాజు కథను పెద్దగా పట్టించుకోలేదు. కేవలం శ్రీవిష్ణు టైమింగ్ తో సినిమాని నడిపించాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆరిజిన్ ఏమిటి? రియలైజేషన్ పాయింట్ ఏమిటి? క్లోజర్ ఏమిటి? అనేది ఎక్కడా పట్టించుకోలేదు. శ్రీవిష్ణు-వెన్నెల కిషోర్ పుణ్యమా అని సినిమా అలా వెళ్లిపోయింది. కథనం మీద కూడా కాస్త కాన్సంట్రేట్ చేసి ఉంటే బాగుండేది. ఎంత టైమ్ పాస్ సినిమా అయినా.. ఎమోషన్ లేదా క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వలేకపోతే ఎంజాయ్ చేయలేము. ముఖ్యంగా సినిమాలో రాజేంద్రప్రసాద్ పాత్రను కేవలం జస్టిఫికేషన్ కోసం వాడుకోవడం, ముగింపు కూడా హీరోయిన్లను ఇరికించి ఎంటర్టైన్ చేసే ప్రయత్నమే తప్ప సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయాడు. ఓవరాల్ గా దర్శకుడిగా కార్తీక్ రాజు పూర్తిస్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయాడనే చెప్పాలి.
విశ్లేషణ: కథ-కథనంతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు ఎంజాయ్ చేస్తాం. వాటికి కూడా ప్రొపర్ జస్టిఫికేషన్ అవసరం. లేకపోతే ఆడియన్స్ దేనికి కనెక్ట్ అవ్వాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతారు. “సింగిల్” విషయంలోనూ అదే జరిగింది. లెక్కలేనన్ని సింగిల్ లైనర్స్, శ్రీవిష్ణు-వెన్నెల కిషోర్ కామెడీ హిలేరియస్ గా నవ్వించినా.. సినిమాగా మాత్రం పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 129 నిమిషాల నిడివి ఉన్న సినిమా కూడా సాగిన భావన. అయితే.. శ్రీవిష్ణు మార్క్ కామెడీ పంచులు ఎంజాయ్ చేసే ఆడియన్స్ మాత్రం హ్యాపీగా సింగిల్ సినిమాని చూడొచ్చు!
ఫోకస్ పాయింట్: సేవియర్ శ్రీవిష్ణు!
రేటింగ్: 2.5/5