మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుండి టాలీవుడ్‌లో చర్చ అంటే… ‘మా’ భవనం గురించే. ‘మా’కు సొంత భవనం అంటూ హామీలు, ప్రమాణాలు, ప్రచారాలు షురూ చేశారు. అయితే ఆ తర్వాత కొందరు మాట మార్చారు. అయితే మోహన్‌బాబు ఈ విషయంలోకి ఎంటర్ అయ్యాక… ‘మా’కు ఒక భవనం కొన్నారని, అయితే… తర్వాత తక్కువ ధరకు అమ్మేశారని తెలిసింది. దీనిపై మొన్న నాగబాబు స్పందిస్తే, తాజాగా శివాజీరాజా స్పందించారు.
తన హయాంలోనే ‘మా’కు భవనం కొన్నారని… అయితే అదొక పెంట్ హౌస్ అని నాగబాబు చెప్పారు. ₹70 లక్షలు పెట్టిన కొన్న ఆ పెంట్ హౌస్‌ని శివాజీరాజా, నరేశ్ ఆధ్వర్యంలో ‘మా’ ఉన్నప్పుడు తక్కువ ధరకు అమ్మేశారని నాగబాబు చెప్పారు. దీంతో విషయం మరో టర్న్ తీసుకుంది. తొలుత నాగబాబు ప్యానల్‌దే తప్పు అని అనుకున్నా, ఆ తర్వాత శివాజీరాజా ప్యానల్‌ది అని నాగబాబు మాటలతో తేలింది. కానీ అదీ నిజం కాదంటున్నారు శివాజీరాజా.
₹70 లక్షలకు పైగా ఖర్చు చేసి ‘మా’ కోసం బిల్డింగ్ తీసుకోవడం వాస్తవమే అని.. తర్వాత దాని మరమ్మతులకు కొన్ని లక్షలు ఖర్చయ్యాయి. కానీ ఆ తర్వాత ఆ భవనంతో సమస్యలు తలెత్తాయి. అంతేకాదు ఆ భవనం ప్రైమ్ ఏరియాలో లేదు. కింద మురుగు కాలువ ఉండటం మరో సమస్య. పోనీ ఖాళీగా ఉందని రెంట్‌కి ఇస్తే సరైన ఆదాయం రాలేదు. ఇక ప్రయోజనం లేదని అమ్మేశాం. మురళీ మోహన్ సహా ‘మా’లోని కీలక వ్యక్తుల సలహా తీసుకుని తక్కువ రేటుకే అమ్మేశాం. అప్పుడు ఈ నిర్ణయాన్ని అభినందించారు. కానీ ప్పుడు వివాదం చేయడం తగదని శివాజీ రాజా అన్నారు. ఇప్పుడు టాలీవుడ్ పెద్దలు ఏమంటారో చూడాలి.