విక్రమ్ హీరోగా విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ మసాలా ఎంటర్ టైనర్ “స్కెచ్”. విక్రమ్ సరసన తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రం జనవరిలో తమిళనాట విడుదలైంది. అక్కడ యావరేజ్ టాక్ తెచ్చుకొన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటివారంలోనే విడుదల చేద్దామనుకొన్నప్పటికీ.. థియేటర్ల సమస్య కారణంగా నేడు (ఫిబ్రవరి 23) విడుదల చేశారు. మరి తమిళంలో యావరేజ్ అనిపించుకొన్న “స్కెచ్” తెలుగు ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ : లోన్ తీసుకొని బండ్లు కొనుక్కొని.. సదరు బండ్ల కోసం తీసుకొన్న లోన్ రెగ్యులర్ ఇంస్టాల్ మెంట్స్ కట్టకుండా తప్పించుకొని తిరుగుతున్న వారి వద్ద నుండి డబ్బు వసూలు చేయడం లేదా బండ్లు తీసుకొచ్చేడం లాంటివి చేస్తుంటాడు స్కెచ్ (విక్రమ్). ఆ రికవరీ ప్రొసెస్ లో ఒకసారి అనుకోకుండా అమ్ము (తమన్నా)తో ప్రేమలో పడతాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తున్న తరుణంలో.. లోకల్ రౌడీ కుమార్ సెంటిమెంట్ కారుని దొంగిలిస్తాడు. తనకు ఎంతో సెంటిమెంట్ అయిన కారుని దొంగిలించడమే కాక తనని రోడ్డు మీద పరిగెట్టించిన స్కెచ్ & గ్యాంగ్ మీద పగ తీర్చుకోవాలనుకొంటాడు కుమార్. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధంలో ఎవరు గెలిచారు అనేది “స్కెచ్” కథాంశం.
నటీనటుల పనితీరు : ఒక పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్ టైనర్ లో విక్రమ్ ను చూసి చాలా ఏళ్లవుతోంది. ఆ లోటు ఈ సినిమాతో తీరుతుంది. తమిళ సినిమా కావడంతో నేటివిటీ పక్కనపెడితే ఉరమాస్ క్యారెక్టర్ లో విక్రమ్ అదరగొట్టాడు. మ్యానరిజమ్స్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకొనేలా ఉన్నాయి. తమన్నా పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఉన్నంతలో అందం, అభినయంతో అలరించింది. బైకులను ఏకంగా షోరూం నుంచి దొంగిలించే బ్యాచ్ గా సూరి కామెడీ ఎపిసోడ్స్ ఓ మోస్తరుగా అలరిస్తాయి. ఇక విలన్లుగా నటించినవారందరూ తమిళ ఆర్టిస్టులే.. అందరూ విలనిజాన్ని వీరలెవల్లో పండించారు.
సాంకేతికవర్గం పనితీరు : తమన్ తన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ తో అలరించాడు. మెలోడీ సాంగ్ ఇన్స్టామ్ట్ హిట్ అయితే.. నేపధ్య సంగీతంతో యాక్షన్ సీక్వెన్స్ బాగా ఎలివేట్ చేశాడు. సుకుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. రెగ్యులర్ సన్నివేశాలే అయినప్పటికీ.. తనదైన కెమెరా టెక్నిక్స్, స్లోమోషన్ షాట్స్ తో వేరియేషన్ చూపించగలిగాడు. తెలుగు డబ్బింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది. చాలా సన్నివేశాల్లో లిప్ సింక్ కుదరలేదు. అలాగే.. డైలాగ్స్ మరీ పేలవంగా ఉన్నాయి. ఇక కథ చాలా పాతది అవ్వడం, కథనంలో అక్కడక్కడా తప్పితే పెద్దగా ట్విస్టులు కానీ.. ఆకట్టుకొనే స్థాయి అంశాలు కానీ పెద్దగా లేకపోవడంతో.. సినిమా అలా సాగుతూ ఉంటుంది కానీ, ప్రేక్షకుడ్ని పెద్దగా అలరించదు.
సో, కొన్ని మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీన్స్ తప్ప “స్కెచ్” సినిమాలో ఆకట్టుకొనే అంశాలేమీ పెద్దగా లేవు. దర్శకుడు విజయ్ చందర్ మాస్ ఎలిమెంట్స్ ను ఎలివేట్ చేయడం మీద పెట్టిన దృష్టిలో సగం ఆకట్టుకొనే కథనంపై కూడా పెట్టి ఉంటే ఇంకాస్త బాగుండేది.
విశ్లేషణ : యాక్షన్ సీక్వెన్స్ లు ఎంజాయ్ చేసేవారికి ఓ మోస్తరుగా నచ్చే చిత్రం “స్కెచ్”. అయితే.. కథనం మరీ స్లోగా ఉండడం, క్లైమాక్స్ ట్విస్ట్ సోసోగా ఉన్నా.. సినిమాని ఎండ్ చేసిన విధానం బాగోకపోవడం వంటి కారణాల వల్ల అన్నీ వర్గాల ప్రేక్షలను అలరించలేకపోవచ్చు.