బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా తనదైన ముద్ర వేసుకున్న నటుడు సోను సూద్. సినిమాల్లో విలన్‌గా కనిపించినా, నిజ జీవితంలో మాత్రం ఎందరికో తన వంతు సాయం అందించి మార్గదర్శిగా నిలిచారు. ముఖ్యంగా కరోనా సమయంలో చేసిన సేవలతో ‘రియల్ హీరో’ అనే బిరుదును సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి ఆయన ఫిట్‌నెస్‌తో వార్తల్లో నిలుస్తున్నారు. 52 ఏళ్ల వయసులోనూ స్టిల్ యంగ్‌గా, ఎనర్జీతో కనిపిస్తున్న సోనూసూద్ ఫిట్‌నెస్ రహస్యం ఏంటో తన మాటల్లోనే చూసేద్దాం రండి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనూసూద్ తన ఫిట్‌నెస్ రహస్యాలను చాలా సింపుల్‌గా వెల్లడించారు. “ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగుతాను. గంటపాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియోతో పాటు ధ్యానం కూడా చేస్తాను. కఠినమైన డైట్ పాటించను. ఇంటి భోజనమే తింటాను కానీ మితంగా మాత్రమే” అని చెప్పారు. ఇదే తన ఫిట్‌నెస్ రహస్యం అని స్పష్టం చేశారు.

తెలుగు ప్రేక్షకులకు సోనూసూద్ అంటే ప్రత్యేకమైన అభిమానం. అరుంధతి సినిమాలో పశుపతి పాత్రతో ఆయన నటనకు నంది అవార్డు దక్కింది. ఆ తర్వాత ఏక్ నిరంజన్, జులాయి, ఆగడు, తీన్‌మార్, కందిరీగ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలతో మెప్పించారు. విలన్‌గా అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అయినా తన నటనతో తెలుగు సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. పంజాబ్‌లోని మోగాలో జన్మించిన సోనూసూద్, నాగపూర్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి మోడలింగ్ ద్వారా సినీ ప్రయాణం మొదలుపెట్టారు. వ్యక్తిగత జీవితంలో కుటుంబానికి ఎంతో విలువ ఇస్తూ, సమాజ సేవలో ముందుండే ఈ స్టార్… తెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ రియల్ స్టార్ అనిపించుకుంటున్నారు.
