తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తొలి సూపర్ స్టార్. తెలుగు జాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు, టీడీపీ వ్యవస్థాపకుడు , మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన సినీ, రాజకీయ రంగాలలో చెరగని ముద్ర వేసి.. తెలుగు వారి గుండెల్లో ‘‘అన్నగారి’’గా చిరస్థాయిగా నిలిచిపోయారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేత, ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేశారు. ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ. ముఖ్యంగా సమయపాలన విషయంలో అన్నగారు చాలా నిక్కచ్చిగా వుండేవారు. ఆయన టైమంటే టైమే.
ఈ విషయంలో ఎవరు హద్దుమీరినా అస్సలు సహించేవారు కాదు. అప్పట్లో షిఫ్ట్ ల ప్రకారం సినిమా షూటింగ్ లు జరిగేవి. అలా ఎన్టీఆర్ కూడా కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో రాత్రి , పగలు పనిచేసేవారు. ఒక స్థాయికి చేరుకున్న తర్వాత రెండు షిఫ్ట్ లు మాత్రమే కేటాయించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మరో సినిమాకు పనిచేసేవారు. అనంతరం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒకే సినిమాకు పనిచేసేవారు.
ఇకపోతే.. అన్నగారి ఆహారపు అలవాట్ల గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు ఇండస్ట్రీలో. రాత్రి 8 నుంచి 9 గంటల లోపు భోజనం పూర్తి చేసి పడుకోవడం.. తెల్లవారుజామున 3 గంటలకు లేచి వ్యాయామం చేయడం ఎన్టీఆర్ కు అలవాటు. పూజాది కార్యక్రమాలు ముగించి బ్రేక్ ఫాస్ట్ చేసేవారు. ఉదయాన్నే 24 ఇడ్లీలను ఆరగించేవారు రామారావు. అవి కూడా ఇప్పటిలా చిన్న సైజువి కావు .. ఒక్కొక్కటి అరచేతి మందంలో ఉండేవి.
కొద్దికాలం తర్వాత ఇడ్లీలు తినడం మానేసి.. పొద్దున్నే భోజనం చేసేవారు , అందులో ఖచ్చితంగా మాంసాహారం వుండాల్సిందే. ఇంతేకాదు ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఎన్టీఆర్ మెనూ ఈ తరం వారు వింటే షాక్ అవ్వాల్సిందే. ఉదయాన్నే 6 గంటలకి షూటింగ్ కి చేరుకునేవారు చెన్నైలో ఉంటే ఖచ్చితంగా భోజనానికి ఇంటికే వెళ్ళేవారు. ఔట్ డోర్ లో ఉంటే ఎలాగూ తప్పదని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే షూటింగ్ గ్యాప్ లో ఆపిల్ జ్యూస్ తాగడం ఆయనకు అలవాటు.
చెన్నై మౌంట్ రోడ్ లోని ‘బాంబే హల్వా హౌస్’ షాప్ నుంచి డ్రై ఫ్రూట్స్, రెండు లీటర్ల బాదం పాలు తెప్పించి తాగేవారు ఎన్టీఆర్. అలాగే 30, 40 మిరపకాయ బజ్జీలు అలవోకగా తినేసేవారు. వేసవిలో మామిడి పళ్ల రసమే ఎన్టీఆర్ లంచ్. టీ నగర్ లో అవి ఎక్కడ దొరుకుతాయో నిర్మాతకు చెప్పి , తెప్పించేవారు. రెండు డజన్ల మామిడి పళ్ల రసంలో గ్లూకోజ్ పౌడర్ కలిపి తాగేవారు. అయితే వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేరళ వైద్యుడి సలహా మేరకు అల్లం, వెల్లుల్లి ముద్దను తీసుకునేవారు రామారావు.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!