మహేష్ బాబు (Mahesh Babu) , రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 సినిమా గురించిన వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రతీరోజూ సినిమా గురించి ఏదో ఒక అప్‌డేట్ బయటకు వస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హైదరాబాద్‌లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను మీడియా స్పాట్ చేయగా, ఆ వెంటనే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వీడియో ఇన్‌స్టాగ్రామ్ లో వైరల్ అయ్యింది. జనవరిలోనే సినిమా లాంచ్ కార్యక్రమం జరిగిందన్న వార్తలు వెలువడగా, ప్రియాంక కూడా అప్పట్లో ఓ షెడ్యూల్‌లో పాల్గొన్నట్లు టాక్.
అయితే, అప్పుడు తన తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా వివాహ వేడుకలు నిమిత్తం కొంత బ్రేక్ తీసుకున్న ఆమె, ఇప్పుడు మళ్లీ సెట్స్‌లో చేరినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 18 నుంచి కొత్త షెడ్యూల్ మొదలుకానుండగా, మహేష్-ప్రియాంక మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ భారీ పాన్ వరల్డ్ సినిమా రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుండటంతో అంచనాలు హై లెవెల్‌కి వెళ్లాయి.
నిర్మాత KL నారాయణ భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, నానా పాటేకర్ (Nana Patekar), మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కూడా కీలక పాత్రలు పోషించనున్నారని టాక్. అయితే, వీరి క్యారెక్టర్లపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రాజమౌళి జాగ్రత్తల కారణంగా వల్ల షూటింగ్ అప్‌డేట్స్ కూడా రివీల్ కావడం లేదు. మహేష్-ప్రియాంక జంట తెరపై ఎలా కనబడుతుందన్నదే ఇప్పుడు అభిమానుల లో ఆసక్తికర చర్చ.
హాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్న ప్రియాంక తొలిసారి మహేష్ సరసన నటించడం, రాజమౌళి తీస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్‌లో ఆమెకు కీలకమైన రోల్ ఉండడం సినిమాపై హైప్‌ను పెంచుతోంది. యాక్షన్, అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ కథతో గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేశారనే టాక్ ఉంది. ఇక త్వరలోనే సినిమా గురించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.