తన అద్భుతమైన గాత్రంతో ఎంతగానో ఆకట్టుకునే మంగ్లీ (Mangli) ఇప్పుడు కన్నీటి పర్యంతమైంది. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంతో తీవ్ర మనోవేదనకు గురై, ఒక బహిరంగ లేఖ ద్వారా తన ఆవేదనను వెల్లగక్కింది. కొంతమంది వ్యక్తులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ, మంగ్లీ తన మనసులోని మాటను బయటపెట్టింది. శ్రీకాంత్ ఆహ్వానం మేరకు గిరిజన ఆత్మీయ వేడుకలో పాల్గొనడం, ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు కుటుంబంతో కలిసి దైవ దర్శనం చేసుకోవడం తనను రాజకీయ వివాదంలోకి లాగిందని వాపోయింది.
అయితే, ఒక కళాకారిణిగా తనను గౌరవించడంలో తప్పేముందని ప్రశ్నించింది. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ లీడర్లు పిలిస్తే పాటలు పాడిన మాట నిజమేనని ఒప్పుకుంటూనే, ఆ తర్వాత ఇతర పార్టీల కార్యక్రమాల్లోనూ పాల్గొన్నానని తెలిపింది. అయితే, ఎప్పుడూ ఏ పార్టీ జెండా మోయలేదని, కేవలం కళాకారిణిగానే తన బాధ్యత నిర్వర్తించానని స్పష్టం చేసింది. రాజకీయ రంగు పులుముకోవడంతో అవకాశాలు కోల్పోయానని, అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేసింది.
అందుకే 2024 ఎన్నికల ప్రచార పాటలను సున్నితంగా తిరస్కరించానని వెల్లడించింది.తన పాట ప్రజల సొత్తు అని, రాజకీయాలకు అతీతంగా తనను ఆదరించాలని కోరింది. బంజారా జాతి నుంచి వచ్చి కష్టాల్లో పాటలు పాడుతూ ఎదిగిన తనకు, శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాలలో చదువుకునే అవకాశం రావడం దైవ సంకల్పమని తెలిపింది. ఎస్వీబీసీ ఛానల్ సలహాదారు పదవిని కూడా పదవులను నమ్ముకుని కాదని, శ్రీహరి దయతో వచ్చిందని వినమ్రంగా తెలిపింది.
చంద్రబాబు పేరుతో జరుగుతున్న ఫేక్ ప్రచారంపై మండిపడింది. దుర్భాషలాడే వెధవలు చేస్తున్న అసత్య ప్రచారంతో బాధపడుతున్నానని తెలిపింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి పాడినందుకే టీడీపీ తనను దూరం పెట్టిందని, ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని వాపోయింది. కుల, మత, రాజకీయ బేధాలు లేని కళాకారిణిగా తనను ఆదరించాలని వేడుకుంటూ తన లేఖను ముగించింది మంగ్లీ.