బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్ అంటూ రకరకాల పేర్లు ఎందుకు? కరోనా – లాక్‌డౌన్ పరిస్థితుల తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది. మొత్తంగా కలిపి ఇండియన్ సినిమా అని పిలవొచ్చు కదా అనేది ఆ వాదన తీసుకొచ్చిన వాళ్ల మాట. తాజాగా స్టార్ యాక్టర్ అనిల్ కపూర్ కూడా ఇదే మాట అన్నారు. ‘వుడ్’ ఎందుకు దండగ అనేది ఆయన భావం. నాలుగు దశాబ్దాలుగా హిందీ సినిమాల్లో మంచి పాత్రలతో అలరిస్తూ వస్తున్నారు అనిల్ కపూర్.
‘మిస్టర్ ఇండియా’ లాంటి సినిమాతో ఆ కాలంలో స్టార్ హీరోగా వెలుగొందారు. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసి మెప్పించారు. తరానికి తగ్గట్టుగా మారిపోయే నటుల్లో ఆయనొకరు. ‘నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్‌లో అనిల్ విలనిజానికి.. ‘యానిమల్’లో తండ్రి పాత్రలో ఆయన చూపించిన అభినయానికి కుర్రకారు కూడా ఫిదా అయిపోయారు. గత తరం వారికి అయితే ‘జకాస్’ అంటూ ఆయన చేసే మేనరిజం గుర్తొస్తుంది. అలా లేటు వయసులో అదిరిపోయే పాత్రలతో సాగిపోతున్న అనిల్ కపూర్..
ఇండియన్ సినిమా అంతా ఒక్కటే అని అంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని పిలవడం మానేయాలని సూచిస్తున్నారు. దక్షిణాది సినిమాల గురించి మాట్లాడుతూ ప్రశంసల జల్లు కురిపించారు. తన ఎదుగుదల సౌత్ సినిమాల నుంచే మొదలైందని గుర్తు చేసుకున్నారు. తెలుగులో బాపు దర్శకత్వంలో ‘వంశవృక్షం’, కన్నడలో మణిరత్నం దర్శకత్వంలో ‘పల్లవి అనుపల్లవి’ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించారు అనిల్ కపూర్. ఆ తర్వాతే హిందీ సినిమాలో హీరోగా ఓ స్థాయికి ఎదిగారు.
ఈ నేపథ్యంలో సౌత్ ఇండస్ట్రీని ఆయన కొనియాడారు అని చెప్పొచ్చు. (Anil Kapoor) “నాకు దక్షిణాది సినిమాలంటే ఇష్టం. అక్కడి నుంచే నటుడిగా ఎదిగాను. ఆ తర్వాత దక్షిణాది సినిమాల హిందీ రీమేక్‌ల్లో నటించి బాలీవుడ్‌లో నిలదొక్కుకున్నాను’’ అని చెప్పారు. ‘వుడ్’ గురించి ఇప్పటికే చాలామంది చెబుతున్నారు. కానీ ఇంకా ఆ పేరు వినిపిస్తోంది. మరి ఎప్పటికీ అందరూ ఉమ్మడిగా ఆలోచన మార్చుకుంటారో చూడాలి.
ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!
భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!