గాడ్స్ ఒన్ కంట్రీగా పేర్కొనే కేరళకి భీభత్సమైన వర్షం కారణంగా వచ్చిన వరదలతో భారీ నష్టం ఏర్పడి, కనీస వసతులు లేక కేరళ పౌరులు ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే. వారి కష్టాలను అర్ధం చేసుకొన్న సామాన్య ప్రజలు, ప్రభుత్వంతోపాటు కొందరు సినిమా హీరోహీరోయిన్లు, దర్శకనిర్మాతలు కూడా మూందుకొచ్చి తమకు చేతనైనంత సహాయ చేసిన, చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆల్మోస్ట్ అందరు హీరోలు తమ స్థాయికి తగ్గట్లుగా సహాయపడ్డారు. అయితే.. కొందరు హీరోలు ఇంకా స్పందించలేదు. దాంతో తమ హీరోని ఎవరైనా ఏమైనా అనుకొంటారనో లేక వేరే హీరోల అభిమానులు తక్కువ చేసి మాట్లాడతారన్న భయం వల్లనో తెలియదు కానీ.. సదరు హీరోహీరోయిన్లు ఇంకా తమ వంతు సహాయం అందించకుండానే అభిమానులు అంత ఇచ్చారు, ఇంత ఇచ్చారు అని ప్రచారం మొదలెడుతున్నారు.
నిజంగానే ఇచ్చారేమో అనే కంగారులో చెక్ చేయకుండా న్యూస్ పబ్లిష్ చేసేస్తున్నారు కొందరు న్యూస్ చానల్స్ & వెబ్ సైట్స్. దాంతో సదరు హీరోహీరోయిన్ల వద్దకు ఆ మ్యాటర్ వెళ్ళాక కానీ అసలు నిజం బయటకి రావడం లేదు. దాంతో అలాంటి ఫేక్ న్యూస్ వైరల్ అవ్వడంతో సదరు హీరోహీరోయిన్లు అభాసుపాలవుతున్నారు. అందుకు నిదర్శనం సన్నీలియోన్, విజయ్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఉదంతాలు. నిజానికి వీళ్ళేవరూ ఇంకా అఫీషియల్ గా తమ విరాళాలు ప్రకటించలేదు. కానీ.. అభిమానులు ఆత్రంతో స్ప్రెడ్ చేస్తున్న ఫేక్ న్యూస్ కారణంగా వాళ్ళందరూ చెడ్డ పేరు మోస్తున్నారు. మరి ఈ రచ్చ కుదుటపడాలంటే సదరు హీరోలందరూ విరాళాలు ప్రకటించడమైనా మొదలెట్టాలి లేదా ఆ విరాళాలు మేము ఇంకా ఇవ్వలేదు అని ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేయాలి.