ఇండస్ట్రీలో ఏ అవకాశం ఎలా వస్తుందో చెప్పలేం. ఒక సినిమా చేస్తే వేరే సినిమా ఛాన్స్ దక్కే అవకాశం ఉంటుంది అని చెబుతుంటారు. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకూడదు అని చెబుతుంటారు. అలా ఓ చిన్న అవకాశాన్ని వదులుకుని, మరో పెద్ద అవకాశం కోల్పోయింది అర్చన. వివాహమయ్యాక సినిమాలకు దూరమైన అర్చన.. ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు భర్తతో కలసి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది అర్చన. ఈ క్రమంలో ‘మగధీర’ సినిమా గురించి చెప్పింది.
‘మగధీర’ సినిమాలో ఓ క్యారెక్టర్ ఇస్తే వద్దన్నారట కదా అని అడిగితే… ‘నాకప్పుడు సరైన అవగాహన లేక చేసిన తప్పు అది. ఆ సమయంలో నాకు చెప్పేవారు లేరు. అందుకే అలా చేశాను. అయితే ఓ చిన్న పాత్ర చేయడం వల్ల మొదటి సినిమా అవకాశం కోల్పోయాక చిన్న పాత్రలు చేయటంపై సరైన ఆలోచన లేకపోయింది. అందుకే ‘మగధీర’ వదులుకున్నా’’ అని చెప్పంది అర్చన. ఆ సినిమాలో సలోని చేసిన చిన్న పాత్ర చేయమని అర్చనను అడిగారట.
అయితే ఆ సినిమాలో ఆ పాత్ర చేసి ఉంటే… ‘మర్యాద రామన్న’లో హీరోయిన్‌గా సెలెక్టయ్యేదాన్నేమో అని అంది అర్చన. ‘మగధీర’లో చూసి జక్కన్న సలోనికి ‘మర్యాద రామన్న’లో అవకాశం ఇచ్చారో లేదో తెలియదు కానీ.. ఒకవేళ అదే నిజమైతే అర్చన అనవసరంగా ‘మగధీర’ వదులుకుంది అని చెప్పొచ్చు. అయితే అలంటి అనుభవాలు చాలానే విషయాలు నేర్పించాయి అని చెప్పింది అర్చన. అలానే ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి నాళ్లలో ముంబయి మేనేజర్లను పెట్టుకుని ఇబ్బందిపడిందట అర్చన. ఆమెకొచ్చిన అవకాశాలను తక్కువ రెమ్యూనరేషన్‌కి వేరేవాళ్లకి వెళ్లేలా చేసేవారట.
దాంతో చాలా విషయాలు తెలుసుకున్నా అని చెప్పింది. బాలకృష్ణకు కొరియోగ్రఫీ చేసిన విసయం కూడా అర్చన చెప్పారు. ‘పాండురంగడు’ సినిమా షూటింగ్ సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పిలిచి ‘సీతా (అర్చనను ఆయన అలానే పిలుస్తారట) ఈ చిన్న బిట్ సాంగ్‌కి నువ్వు కొరియోగ్రఫీ చెయ్యు’ అన్నారట. అలా బాలకృష్ణకు స్టెప్స్ నేర్పించారట అర్చన. బాలయ్య స్టెప్పులు నేర్చుకున్న తీరు, ఆయన అంకితభావం ఆశ్చర్యపరిచింది అని చెప్పారు అర్చన.