భోజ్‌పురి ఇండస్ట్రీ సూపర్ స్టార్ పవన్ సింగ్ పై నటి యామినీ సింగ్ తీవ్ర ఆరోపణలు చేసింది. అతడితో కలిసి పని చేయడం ఇష్టం లేదని యామినీ తెలిపింది. ఆయన సినిమాల్లో హీరోయిన్స్ కి సరైన పాత్ర దక్కదని కొన్నేళ్ల క్రితం ఆమె చెప్పింది. నిజానికి పవన్ తో కలిసి పని చేయకపోవడానికి కారణం వేరే ఉందని ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో యామినీ తెలిపింది. ఈ క్రమంలో పవన్ సింగ్ తనను రాజీ పడమని అడిగినట్లు చెప్పుకొచ్చింది.
పవన్ సింగ్ తనకు సినిమా అవకాశం ఇచ్చినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుందని.. అందులో నిజం లేదని చెప్పింది. తను నటించిన మొదటి సినిమా ‘బాస్’ అవకాశాన్ని దర్శకుడు అరవింద్ చౌబే ఆఫర్ చేశారని గుర్తుచేసుకుంది. ఆ సినిమా నుంచి తనను ఎవరూ తొలగించలేదని.. తనే సినిమా ఆఫర్ వదులుకున్నట్లు చెప్పింది. పవన్ చాలా మంచివాడని, మంచి యాక్టర్ గా తనకు తెలుసని.. సెట్స్ లో మొదటిసారి అతడిని కలిసినప్పుడు ఆ విషయం చెప్పానని తెలిపింది యామినీ.
అప్పటివరకు అతడి గురించి తనకు నిజం తెలియదని వాపోయింది. ఇదే సమయంలో అతడి అభిమానులను ఉద్దేశిస్తూ.. ఎవరైనా వారి తల్లి, సోదరి, కుమార్తెను అతను ఇలాంటి పని చేయమని అడిగితే.. అతన్ని ఇంకా అభిమానిస్తారా..? అని ప్రశ్నించింది. పవన్ సింగ్ ఓరోజు రాత్రి 9 గంటల సమయంలో తనకు కాల్ చేసి.. ఆటోలో స్టూడియోకి రమ్మని పిలిచాడని చెప్పింది. ఆ సమయంలో రాలేనని చెబితే.. సినిమా చేయాలని ఉందా..? లేదా..? అని బెదిరించాడని.. దీంతో కాల్ కట్ చేసి.. సినిమా నుంచి తప్పుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.