అదృష్టానికి అర్థరాత్రి, అమావాస్య లాంటి పట్టింపులేమీ ఉండవ్.. ఎప్పుడు, ఎలా.. ఏ రూపంలో డోర్ నాక్ చేస్తుందో చెప్పలేం.. తలుపు చప్పుడైనప్పుడు తెరవాలే కానీ తెల్లారాక రా.. చేతులు ఖాళీ లేవు అని సాకులు చెప్పకూడదు.. కాలంతో పాటు లక్ కూడా కలిసి రావాలి అనేది అందుకే మరి.. ఓ సినీ నటి ఇంట్లో పనివాడు ఇలానే అదృష్టం కలిసొచ్చి కోటీశ్వరుడైపోయాడు.. వివరాల్లోకి వెళ్తే.. రజినీ చాందీ మలయాళంలో సీనియర్ నటి..
పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.. మాలీవుడ్ క్లాసిక్ ‘ప్రేమమ్’ లో హీరో నివీన్ పౌలి తల్లిగా నటించారామె.. ఇదిలా ఉంటే.. అసోంకు చెందిన ఆల్బర్ట్ టిగా అనే వ్యక్తి 1995లో పని కోసం కేరళ వచ్చాడు.. కొద్ది కాలంగా రజినీ ఇంట్లో పనిచేస్తున్నాడు.. అతనికి లాటరీ టికెట్స్ కొనే అలవాటు ఉంది.. ఎప్పటిలానే ఇటీవల ఎస్ఈ 222282 టికెట్ కొనుగోలు చేశాడు.. కట్ చేస్తే ఈసారి తన లక్ లప్పంలా అంటుకుంది..
కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్ ‘సమ్మర్ బంపర్ బీఆర్ 90 లాటరీ’ విడుదల చేసిన ఫలితాల్లో ఆల్బర్ట్ టిగాకి ఏకంగా రూ. 10 కోట్ల భారీ బంపర్ లాటరీ తగిలింది.. కేేరళలోగల తిరువనంతపురంలోని గోర్కీ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.. ఈ లాటరీలో ఫస్ట్ ప్రైజ్ రూ. 10 కోట్లు.. అదే మనోడికి వచ్చింది.. ఇక సెకండ్ ప్రైజ్ ‘ఎస్‌బీ 152330’ నంబర్‌కి వచ్చింది.. హైలెట్ ఏంటంటే రెండో బహుమతి కేవలం రూ. 50 లక్షలు మాత్రమే..
మూడో బహుమతి రూ. 5 లక్షలు, నాలుగో విజేతకు రూ. 1 లక్ష.. చివరిగా 5వ విన్నర్‌కి రూ. 5 వేలు అన్నమాట.. లాటరీ తగిలిన విషయం తెలియగానే ఎగిరి గంతేసినంత పని చేసిన ఆల్బర్ట్.. ప్రైజ్ మనీ కోసం చేయాల్సిన ప్రాసెస్ అంతటినీ పూర్తి చేసి.. కొచ్చిలోని ఓ బ్యాంకులో తన లాటరీ టికెట్ అప్పజెప్పాడు.. తను ఎప్పటిలానే నటి ఇంట్లో పని కంటిన్యూ చేస్తాడో.. లేక, కోట్లొచ్చిన ఆనందంతో సొంతూరికి వెళ్తాడో మరి..