అడివి శేష్ టాలివుడ్లో ఉన్న యంగ్ హీరోల్లో ఒకడు. మొదట్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించాడు. అలాగే హీరోగా, డైరెక్టర్ గా కూడా మారి ‘కర్మ’ అనే సినిమా చేశాడు. అది అసలు వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు. తర్వాత ‘కిస్’ అనే సినిమాకి కూడా డైరెక్షన్ చేశాడు. అది కూడా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్ళిపోయిందో ఎవ్వరికీ తెలీదు. అయితే తర్వాత ఇతను కంప్లీట్ హీరోగా మారి ‘క్షణం’ అనే సినిమా చేశాడు.
ఇది బాగా ఆడింది. దీనికి రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత అతను ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ‘బబుల్ గమ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుమ కొడుకు రోషన్ కనకాల ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. డిసెంబర్ 29 న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు రవికాంత్ పేరెపు హీరో అడివి శేష్ పై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.
అతను ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. ” ‘క్షణం’ సినిమా హిట్టయినా క్రెడిట్ మొత్తం హీరో అడివి శేష్ కే వెళ్ళిపోయింది. దర్శకుడిగా మారి 7 ఏళ్ళు అయినప్పటికీ నేను ఇప్పటివరకు కేవలం 3 సినిమాలే చేయడానికి గల కారణం అదే. నేను మాత్రమే కాదు అడివి శేష్ సినిమాలకి డైరెక్షన్ చేసిన వాళ్లందరికీ కూడా క్రెడిట్ దక్కడం లేదు. అలా అని (Adivi Sesh) అడివి శేష్ ను తప్పుబట్టడం లేదు.
అతన్ని అడిగితే కచ్చితంగా తన సినిమాల సక్సెస్..లకు డైరెక్టర్లే కారణం అని చెబుతాడు” అంటూ చెప్పుకొచ్చాడు. రవికాంత్ పేరెపు కామెంట్స్ ను బట్టి.. ఓ రకంగా ఇది నిజమనే చెప్పాలి. అడివి శేష్ హీరోగా నటించిన సినిమాలకి డైరెక్టర్స్ కి క్రెడిట్ దక్కడం లేదు. ఒక్క శైలేష్ కొలను(‘హిట్'(సిరీస్..ల దర్శకుడు) మాత్రమే ఒకింత పాపులర్ అయ్యాడు అని చెప్పాలి.