ఇండియన్ సినిమా ఫోకస్ ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu), రాజమౌళి (S. S. Rajamouli) కాంబోలో వస్తున్న SSMB29 సినిమాపైనే ఉంది. ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీకి అన్ని కోణాల్లో రికార్డు స్థాయిలో ప్లానింగ్ జరుగుతోంది. ఇంటర్నేషనల్ టెక్నీషియన్లతో, అత్యున్నత గ్రాఫిక్స్‌తో సినిమాను ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నాడు. కథ సిద్ధంగా ఉండగా, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌పై పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో డైలాగ్స్ రైటర్‌గా దర్శకుడు దేవా కట్టా (Deva Katta) ఎంపికయ్యే అవకాశాలున్నాయట.
ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించబడకపోయినా, ఈ వార్తను ఇండస్ట్రీ వర్గాలు విశ్వసనీయంగా చెబుతున్నాయి. గతంలో బాహుబలి వెబ్ సిరీస్‌కు దేవా కట్టా స్క్రిప్ట్ వర్క్ చేయగా, రాజమౌళితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ అనుభవాన్ని SSMB29లో ఉపయోగించాలన్నదే రాజమౌళి ఆలోచనట. దేవా కట్టా గతంలో దర్శకత్వంలో ఆశించిన స్థాయికి వెళ్లలేకపోయినా, రచయితగా మాత్రం మంచి పేరు సంపాదించుకున్నాడు.
ప్రస్థానం (Prasthanam), రిపబ్లిక్ (Republic) వంటి సినిమాల్లో అతని డైలాగ్స్‌లో ఉన్న సాంఘిక సూత్రాలు, భావోద్వేగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహేష్ బాబు పాత్రకు డెప్త్ ఇచ్చేలా పవర్ఫుల్ డైలాగ్స్ అందించగల సత్తా దేవా కట్టాలో ఉందని రాజమౌళి నమ్ముతున్నట్టు టాక్. ఇప్పటి వరకూ వచ్చిన సమాచారం ప్రకారం, ఈ సినిమా అడ్వెంచర్, ఎమోషన్, ఫిలాసఫీ మిళితంగా ఉండబోతోంది.
అటువంటి ప్రాజెక్ట్‌కి కథను పంచుకునేలా ఉండే డైలాగ్స్ అవసరం. అలాంటి సందర్భంలో దేవా కట్టా వంటి రచయిత ఎంపిక కావడం ఆశ్చర్యంగా అనిపించొచ్చు కానీ అవసరంగా మారింది. ఇది దేవా కట్టా కెరీర్‌కి మళ్లీ వెలుగు చూపించే అవకాశం కావచ్చు. ఇక ఈ వార్తపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.