ఆచితూచి అడుగులు.. ఆ సింగర్ జీవిత కథ వైపునకు స్టార్ హీరో!
- October 27, 2024 / 05:22 PM ISTByFilmy Focus
ఒకప్పుడు ఆ హీరో ఏ సినిమా చేసినా హిట్టే. ఆయన ఓ సినిమా కోసం పడ్డ కష్టం చూసి మిస్టర్ పర్‌ఫెక్ట్ కదా.. ఆ మాత్రం ఉంటుంది లెండి అని అనేవారు. అలాంటి హీరోకు ఇటీవల కాలంలో హిట్లు లేవు. అంతేకాదు ఆయన పనితనం మీద, నిబద్ధత మీద విమర్శలు వచ్చాయి. సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేసే పరిస్థితి వచ్చింది. అతనే ఆమిర్ ఖాన్ (Aamir Khan). బాలీవుడ్ స్టార్ త్రయంలో ఒకరైన ఆమిర్ ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.
Aamir Khan

ఈ క్రమంలో బాలీవుడ్‌లో హిట్ ఫార్ములా అయిన జీవిత కథలను పట్టుకున్నాడు అని చెబుతున్నారు. ఈ విషయంలో డౌట్స్ కొన్ని ఉన్నా.. పక్కాగా ఆమిర్ అయితే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు అని అంటున్నారు. ‘లాల్‌సింగ్ చద్దా’ (Laal Singh Chaddha) సినిమా పరాజయం తర్వాత కొత్త కథల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్నాడు ఆమిర్. ప్రస్తుతం ‘సితారే జమీన్ పర్’ పనుల్లో బిజీగా ఉన్న ఆయన.. కొత్త ప్రాజెక్టును ఓకే చేశాడని వార్తలొస్తున్నాయి.
దివంగత గాయకుడు, నటుడు కిశోర్ కుమార్ (Kishore Kumar) మీద ఓ బయోపిక్ తెరకెక్కించే ప్రయత్నం కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా ప్రధాన పాత్ర కోసం గత కొన్ని రోజులుగా చాలా పేర్లు వినిపిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆమిర్ పేరు వచ్చింది. దర్శకుడు అనురాగ్ బసు, నిర్మాత భూషణ్ కుమార్ (Bhushan Kumar) ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్‌ను ఓకే చేయించే పనిలో ఉన్నారట. ఆమిర్ ఖాన్ (Aamir Khan) చర్చలు పూర్తి చేసి సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

‘సితారే జమీన్ పర్’ సినిమా పనులు పూర్తి స్థాయిలో అయిపోతే అప్పుడు ఈ సినిమా ముందుకెళ్తుందని అంటున్నారు. ఈ లోపు ‘కూలీ’ (Coolie) సినిమాలో అతిథి పాత్ర చిత్రీకరణ చేసేసే ఆలోచలో ఉన్నారట. రజనీకాంత్ (Rajinikanth) – లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ నటిస్తున్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.














