ముంబై నుండి వచ్చి తెలుగు చిత్రసీమలో పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ కావ్య థాపర్ (Kavya Thapar) అప్పుడప్పుడు ఇంటర్వ్యూలతో హాట్ టాపిక్ గా మారుతోంది. భాషా సమస్యల వల్ల కొన్ని సరదా, ఆసక్తికరమైన అనుభవాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. 2018లో ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమె, ‘ఏక్ మినీ కథ’ (Ek Mini Katha), ‘బిచ్చగాడు 2’, ‘ఈగల్’ (Eagle), ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona), ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) వంటి సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. విజయాలు తక్కువగా వచ్చినప్పటికీ, ఆమెకు ఆఫర్లు వరుసగా వస్తూనే ఉన్నాయి.
Kavya Thapar
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కావ్య థాపర్, తన మొదటి సినిమా షూట్ సమయంలో తెలుగు భాష రాకపోవడం వల్ల ఎదుర్కొన్న ఫన్నీ అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘హైదరాబాద్ వచ్చినప్పుడే, ఒకసారి షూటింగ్ లో ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి ‘రండి మేడం, షాట్ రెడీ’ అని చెప్పాడు. మొదట దీన్ని విన్నప్పుడు షాక్ అయ్యాను. ఎందుకంటే హిందీలో ‘రండీ’ అనే పదానికి విభిన్న అర్థం (సె** వర్కర్) ఉండటంతో, నన్ను ఏదో తిట్టారేమో అనుకుని కంగారు పడ్డాను,’’ అని అన్నారు.
దీంతో ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్న కావ్య, నిర్మాత వద్దకు వెళ్లి కంప్లైంట్ చేసిందట. అతను నవ్వుతూ, ‘‘తెలుగులో ‘రండి’ అంటే గౌరవంగా పిలవడం మాత్రమే, షూట్ కోసం రమ్మన్నట్లు అతను చెప్పాడు’’ అని వివరించగా, ఆమె అర్థం చేసుకొని నవ్వుకుందట. తెలుగు భాష రాకపోవడంతో కవ్యా థాపర్ తలపడ్డ ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇలాంటి సందర్భాలు మిగతా హీరోయిన్లు కూడా ఎన్నిసార్లు ఎదుర్కుంటున్నారో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక కవ్యా పాప ఇటీవల డబుల్ ఇస్మార్ట్ సినిమాతో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. మరి రాబోయే సినిమాలతో అయినా ఆమె లక్కు ఏమైనా మారుతుందేమో చూడాలి.