తెలుగు రాష్ట్రాల్లో తన సినిమాలతో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న స్టార్ హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరు. బాలీవుడ్ లో కొన్నేళ్ల క్రితం జంజీర్ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకున్న రామ్ చరణ్ కు ఆ సినిమా ఫలితం నిరాశను మిగిల్చింది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయం దక్కుతుందని చరణ్ నమ్మకంతో ఉన్నారు. తాజాగా చరణ్ ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా చాలా ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు.
ఆర్ఆర్ఆర్ సినిమా ఇచ్చిన ధైర్యం వల్ల రాబోయే రోజుల్లో మరిన్ని హిందీ సినిమాలు ధైర్యంగా చేయగలనని చరణ్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో మరిన్ని పాన్ ఇండియా సినిమాలలో తాను నటిస్తానని చరణ్ కామెంట్లు చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రేక్షకులు సినిమాలను చూసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుందని చరణ్ అభిప్రాయపడ్డారు. ఆర్ఆర్ఆర్ సినిమాపై తన మాటలతో చరణ్ అంచనాలను పెంచుతున్నారు. శంకర్ చరణ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.
గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఒక సినిమాకు, సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమాకు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. చరణ్ భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్నాయి. ఆర్ఆర్ఆర్ రిలీజైతే చరణ్ భవిష్యత్తు ప్రాజెక్టులకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు చిరంజీవి, చరణ్ తో కలిసి నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా పడింది. సర్కారు వారి పాట సినిమా ఆ తేదీకి రిలీజ్ కాదని కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల ఆచార్య సినిమాను వాయిదా వేశారని తెలుస్తోంది.
సర్కారు వారి పాట రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుండగా మేకర్స్ స్పందించాల్సి ఉంది. కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల పెద్ద సినిమాల విడుదల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంక్రాంతి పండుగకు విడుదల కావాల్సిన పాన్ ఇండియా సినిమాలన్నీ వాయిదా పడటంతో బంగార్రాజుకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి.