పరమశివుడు (Lord Shiva) అనగానే అందరికీ గుర్తొచ్చేది.. ఆయనకు కోపం ఎక్కువ. మూడో కన్ను తెరిస్తే భస్మమే అని కొందరు అనుకోవచ్చు. కానీ శివునికి ఉన్న గొప్ప లక్షణాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన ఎలాంటి కష్టాన్ని అయినా మనసులో పెట్టుకుంటాడు. ఆ విషయాన్ని ‘విషాన్ని కంఠంలో పెట్టుకున్న’ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. అలాగే ఆయన కోరికలు తీర్చడంలో కూడా ముందుంటాడు. పురాణాల్లో చూసుకుంటే ‘దుర్మార్గులకు, స్వార్థపరులకి’ కూడా వరాలు ఇచ్చి ఆయన సైతం ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. భూలోకంలో కూడా శివునికి పూజలు వంటివి చేస్తే కోరికలు కచ్చితంగా తీరతాయి అని భావించే జనాలు కూడా కోకొల్లలు. జాతక రీత్యా ఏదైనా దోషం ఉంటే శివునికి పూజలు వంటివి చేస్తే వాటికి పరిహారం దొరుకుతుంది అనేది అందరి నమ్మకం.ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన జాగారం చేస్తూ ఆ పరమ శివుడిని ఆరాధిస్తే.. ఆయన కరుణ, కృప పొందుతాము అని అంతా విశ్వసిస్తారు.
అలాగే ప్రేక్షకులు జాగారం చేసే టైంలో ఎక్కువగా పరమ శివుని (Lord Shiva) భక్తి పాటలు, పరమశివుని గొప్పతనం తెలుపుతూ వచ్చిన సినిమాలు వీక్షించాలని భావిస్తారు. ఈ విషయాలు ఇలా ఉంచితే.. పరమ శివుని పాత్రలో మెప్పించడం అంత సులువైన విషయం కాదు. శివుని లక్షణాలు చాలా గొప్పవి. పురాణాల్లో వర్ణించింది కూడా జనాలకి అంత ఈజీగా ఎవ్వరికీ అర్థం కాదు. కానీ కొన్ని సినిమాల రూపంలో ఆయన గొప్పతనం అందరికీ తెలిసింది. టాలీవుడ్లో కొంతమంది స్టార్స్.. కొన్ని సినిమాల్లో పరమ శివుని పాత్రలు పోషించడం జరిగింది. ఆ స్టార్స్ ఎవరో.. అవి ఏ సినిమాలో ఓ లుక్కేద్దాం రండి :
1) నందమూరి తారక రామారావు (Sr NTR) :
సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎక్కువగా రాముడు, కృష్ణుడు పాత్రలు మాత్రమే చేశారేమో అని అంతా అనుకుంటారు. నిజమే కానీ ఆయన పురాణాల్లో చాలా మందికి తెలియని పాత్రలు కూడా చేశారు. ‘దక్షయజ్ఞం’,‘ ఉమా చండీ గౌరీ శంకరుల కథ’ వంటి సినిమాల్లో పరమశివుని పాత్రలో కూడా మెప్పించారు.
2) అక్కినేని నాగేశ్వరరావు (ANR):
ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘మూగ మనసులు’ సినిమాలో ‘గౌరమ్మా నీ మొగుడెవరమ్మా’ అనే పాట ఉంటుంది. అందులో పరమ శివునిగా ఏఎన్నార్ కనిపిస్తారు.
3) శోభన్ బాబు :
అప్పట్లో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా సంపాదించుకున్న హీరోగా శోభన్ బాబు నిలిచారు. అయితే ‘పరమానందయ్య శిష్యుల కథ’ సినిమాలో పరమశివుని పాత్ర పోషించి మెప్పించారు శోభన్ బాబు.
4) కృష్ణంరాజు (Krishnam Raju) :
రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ‘వినాయక విజయం’ సినిమాలో పరమశివునిగా కనిపించి మెప్పించారు. కమలాకర కామేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకుడు.
5) బాలయ్య :
ఒకప్పటి నటుడు బాలయ్య కూడా ఎక్కువ సినిమాల్లో శివుడిగా కనిపించి మెప్పించారు.
6) రంగనాథ్ (Ranganath) :
సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘ఏకలవ్య’ చిత్రంలో రంగనాథ్ శివుడి పాత్రలో కనిపించి మెప్పించారు.
7) నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) :
జంధ్యాల దర్శకత్వంలో చేసిన ‘సీతా రామకళ్యాణం’ సినిమాలో పరమ శివుని పాత్రని పోషించారు నటసింహం బాలకృష్ణ.
8) సుమన్ (Suman) :
ఒకప్పటి స్టార్ హీరో సుమన్ సైతం ‘శ్రీ సత్యనారాయణ మహత్యం’ సినిమాలో శివుడిగా కనిపించి మెప్పించారు.
9) మల్లికార్జున్ :
ఈవీవీ సత్యనారాయణ (E. V. V. Satyanarayana) దర్శకత్వంలో విజయ్ శాంతి (Vijayashanti), కార్తీక్.. జంటగా ‘మగరాయుడు’ అనే సినిమా తెరకెక్కింది. ఇందులో మల్లికార్జున్ పరమశివుని పాత్రలో నటించి మెప్పించారు.
10) ప్రకాష్ రాజ్ (Prakash Raj) :
నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘ఢమరుఖం’ (Damarukam) సినిమాలో పరమ శివుని పాత్రలో నటించి మెప్పించారు విలక్షణ నటులు ప్రకాష్ రాజ్.
11) రావు గోపాలరావు (Rao Gopal Rao) :
ఒకప్పటి స్టార్ యాక్టర్ రావు గోపాలరావు కూడా ‘మావూళ్లో మహాశివుడు’ అనే సినిమాలో పరమ శివుని పాత్రని పోషించారు.
12) రాజనాల (Rajanala) :
‘ఉషా పరిణయం’ సినిమాలో పరమ శివునిగా నటించి మెప్పించారు సీనియర్ నటులు రాజనాల.
13) నాగ భూషణం :
‘ఉమా సుందరి’, ‘భూకైలాస్’, ‘నాగుల చవితి’ వంటి సినిమాల్లో శివుడిగా కనిపించారు సీనియర్ నటులు నాగభూషణం.
14) చిరంజీవి (Chiranjeevi) :
కె.విశ్వనాథ్ (K. Viswanath) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆపద్బాంధవుడు’ (Aapadbandhavudu), కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీ మంజునాథ’ సినిమాల్లో శివుడి పాత్రలో కనిపించారు చిరు.
15) అక్షయ్ కుమార్ (Akshay Kumar) :
తెలుగులో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ (Kannappa) సినిమాలో అక్షయ్ కుమార్ పరమ శివుని పాత్రలో కనిపించబోతున్నారు.