చిత్ర పరిశ్రమలో కొద్ది కాలంగా జరుగుతున్న పరిణామాలు అందర్నీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.. వరుస మరణాలు, ప్రమాదాలు వంటి విషయాలతో షాక్ అవుతున్నారు.. ఎప్పుడో ఎలాంటి దుర్వార్త వినాల్సివస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.. తాజాగా ప్రముఖ సింగర్ ప్రమాదానికి గురయ్యారనే వార్తతో సినీ వర్గాల వారు ఉలిక్కిపడ్డారు.. వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ నేపథ్య గాయని బాంబే జయశ్రీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.. ప్రస్తుతం యూకేలో ఉంటున్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం..
తీవ్రమైన మెడనొప్పితో ఆమె కిందపడిపోయారని సన్నిహితులు చెప్పారు.. జయశ్రీ లివర్‌పూల్‌లోని ఒక హోటల్‌లో అపస్మారకస్థితిలో కనిపించగా.. గమనించిన సిబ్బంది వెంటనే దగ్గర్లోని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు.. అయితే ఆమెకు కీ హోల్ సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది.. వైద్యులు మెరుగైన వైద్యం అందిచారని.. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యానికి, మందులకు ప్రతిస్పందిస్తున్నారని సన్నిహితులు వెల్లడించారు.. జయశ్రీ కోలుకున్న తర్వాత చెన్నైకి తీసుకెళ్లనున్నారట.. ఇక బాంబే జయశ్రీ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు..
తన మధురమైన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి అలరించారు.. ఆమె ప్రతిభకు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కింది.. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఎన్నో గీతాలు ఆలపించారు.. కాగా ఇటీవల జయశ్రీకి సంగీత కళానిధి అవార్డును ప్రదానం చేయనున్నట్లు సంగీత అకాడమీ ప్రకటించింది.. ఇలాంటి సమయంలో జయశ్రీ ప్రమాదానికి గురవడం బాధాకరం.. ఆమె త్వరగా కోలుకోవాలంటూ.. సినీ, సంగీత ప్రియులు సామాజిక మాధ్యమాలలో పోస్టులు చేస్తున్నారు..