మన దగ్గర కొరియన్ సినిమాలు రీమేక్ అవ్వడం చూస్తుంటాం, ఫ్రీమేక్ అవ్వడం కూడా చూస్తుంటాం. సీరియల్స్ సంగతి అయితే ఏ హిందీ నుండో, తమిళం నుండో రావడం చూస్తుంటాం. వెబ్ సిరీస్‌ల విషయానికొస్తే ఎక్కువగా హిందీవే వస్తుంటాయి. తాజాగా ఓ కొరియన్ వెబ్‌సిరీస్‌ను మన దగ్గరకు తీసుకొస్తున్నారు. అందులోనూ అందులో నటించిన హీరోయిన్ మనకు బాగా తెలిసిన హన్సికనే. అవును మేం చెబుతున్నది ‘మై3’ (MY 3) వెబ్ సిరీస్ గురించే.
దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత మెల్లగా సినిమాలు తగ్గిపోయిన హీరోయిన్ (Hansika) హన్సిక మొత్వానీ. పెళ్లి అయిన తర్వాత ఈ యాపిల్ బ్యూటీ మళ్లీ జోరు పెంచింది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పార్టనర్’ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌ను రెడీ చేసింది. ‘మైత్రీ’ పేరుతో తెరకెక్కిన ఆ సిరీస్ త్వరలో ఓ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, మరాఠి, హిందీ భాషల్లో ఈ సిరీస్‌ను విడుదల చేస్తున్నారు.
డిస్నీ + హాట్ స్టార్ ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి అప్‌డేట్ కూడా ఇచ్చింది. అందులో హన్సిక సగం ఏఐ రోబోట్‌గా, మిగతా సగం మనిషిగా కనిపిస్తోంది. నటుడు మ్యుగెన్ చేతులకు గ్లోవ్స్‌తో కనిపించాడు. ఇది ఒక రోబోటిక్ లవ్ స్టోరి అని టీమ్ ఇప్పటికే చెప్పేసింది. హన్సిక పాత్రల్లో ఒకటి మైత్రీ కాగా, మరొకటి MY3 రోబోట్. ఇక కొరియాలో పాపులర్ టీవీ షో ‘ఐ యామ్ నాట్ ఎ రోబోట్’ ఈ సిరీస్ రీమేక్ అని సమాచారం. అందులో హీరోయిన్ ఇలానే రోబోగా నటిస్తుంది.
బాగా డబ్బున్న హీరో అరుదైన అలర్జీతో బాధపడుతుంటాడు. మనుషులను తాకితే అతడి శరీరమంతా అలర్జీకి గురవ్వుతుంది. అది ఎక్కువైతే ప్రాణాలకే ప్రమాదం. అందుకే చేతులకు గ్లోవ్స్ తొడుగుతాడు. మనుషులను దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేకపోవడంతో అతడి పనులు చేయడానికి మనిషి లాంటి రోబోను తయారు చేయాలని సైంటిస్ట్ టీమ్‌కు చెబుతాడు. వారు ఓ అమ్మాయి రూపాన్ని తీసుకుని రోబో చేస్తారు. సరిగ్గా డెలివరీ చేసే సమయానికి రోబోట్ పనిచేయదు. దీంతో ఆందోళన గురైన రోబో తయారీ టీమ్..
ఆ రోబోట్ రూపంలో ఉండే అమ్మాయిని హీరో ఇంటికి పంపిస్తారు. అయితే ఆ అమ్మాయిని చూసి ఆ హీరో రోబో అనే అనుకుంటాడు. ఆ తర్వాత రోబోతో ప్రేమలో పడతాడు. ఇంటికి వచ్చి మైత్రీ రోబో కాదని తెలిసి హీరో ఎలా స్పందిస్తాడు? చివరికి ఏం జరిగింది అనేదే కథ. మరి మన దగ్గరకు వచ్చేటప్పటికీ ఏమైనా మార్పులు చేస్తారేమో చూడాలి.