కృష్ణ (Krishna) అల్లుడిగా, మహేశ్ బాబు (Mahesh Babu) బావగా సినిమాల్లోకి వచ్చినా.. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కథానాయకుడు సుధీర్‌బాబు. విభిన్న కథలను ఎంచుకుంటూ.. తన సినీ ప్రయాణం కొనసాగిస్తున్న ఆయన.. ఇప్పుడు మరోసారి ‘హరోం హర’ (Harom Hara) అంటూ ప్రయోగంతో వస్తున్నాడు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సుధీర్ బాబు (Sudheer Babu). దీంతో ఆయన మాటలు వైరల్‌గా మారాయి. తాను నటించిన సినిమాల్లో ‘ప్రేమకథా చిత్రమ్’ మినహా అన్ని సినిమాల ఫలితాల విషయంలో నిరుత్సాహపడ్డాడట సుధీర్‌బాబు.
ఆయా సినిమాలు కమర్షియల్‌గా ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సినవి అని అన్నారు. ప్రేక్షకులకు ఆ సినిమాలను చేరువ చేయడంలో తాను ఫెయిల్ అయ్యానేమో అని అనిపిస్తుంటుంది అని సుధీర్‌బాబు తన కెరీర్‌ను, చేసిన సినిమాలను విశ్లేషించుకున్నాడు. ‘భలే మంచి రోజు’ (Bhale Manchi Roju) , ‘సమ్మోహనం’ (Sammohanam) , ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ (Aa Ammayi Gurinchi Meeku Cheppali) లాంటి సినిమాలు బాగుంటాయయని, కానీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు అని సుధీర్‌బాబు అన్నాడు. ఆయన చెప్పినట్లే ఆ మూడు సినిమాలు కెరీర్‌లో మంచి పిక్చర్స్ అని చెప్పొచ్చు.
అయితే ఆ సినిమాలు వచ్చేనాటి పరిస్థితులు, అప్పటి మార్కెట్ తదితర అంశాల వల్ల అవి సరిగ్గా ఆడలేదు అని చెప్పాలి. ఇక మహేశ్‌బాబుతో మల్టీస్టారర్ ఎప్పుడు అని అడగ్గా.. అందుకు తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు సుధీర్‌బాబు. అయితే మల్టీస్టారర్ సినిమా గురించి తమ మధ్య ఇప్పటివరకు చర్చ జరగలేదని చెప్పిన ఆయన.. ఏదో ఒక రోజు ఆ సినిమా సాధ్యం కావొచ్చు అని అంచనా వేశాడు. దీంతో ఆ రోజు కోసం మహేష్ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.
ఇక ‘హరోం హర’ సినిమా గురించి చూస్తే.. చిత్తూరు జిల్లా కుప్పంలోని 1989 నాటి పరిస్థితుల నేపథ్యంలో సినిమా సాగుతుంది. అప్పటి పరిస్థితుల్ని సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్. ఇక ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది.