సంప్రదాయాలు, శాస్త్రాల ప్రకారం పండగలెనున్నా.. సగటు సినీ అభిమానికి మాత్రం ప్రతి శుక్రవారం పండగే. సినిమా నచ్చితే పెట్టిన వందకి వచ్చిన తృప్తి తద్వారా పొందే ఆనందం వారికే సొంతం. అది కాకుండా ‘కథ’ మారితే మరో శుక్రవారం వచ్చేవరకు తిట్లు.. భాద మరీ ఎక్కువైతే బూతుల రూపేణా బయటికొచ్చేస్తుంది. కన్నీరు కార్చే అవకాశం లేనే లేదు. ఇప్పటి సినిమాల్లో సెంటిమెంట్ కి చోటే లేదు. పోనీ గ్లిజరిన్ స్టాక్ ఎక్కువైందనో, రేట్ తక్కువైందనో అలాంటి సన్నివేశాలు ఉన్నాయే అనుకుందాం కళ్ళు చెమర్చుతాయేమో అనుకునేలోపు అవసరమున్నా లేకపోయినా అక్కడి పాత్రలు, కథతో సంబంధం లేకుండా ఓ కామిడీ ట్రాక్ వచ్చేస్తుంది. మరాలంటపుడు ఈ ఏడుపు గోలేంటి అంటే…
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో యాక్టర్ కమ్ డైరెక్టర్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న శ్రీనివాస్ అవసరాల రెండో ప్రయత్నంగా చేసిన చిత్రం ‘జ్యో అచ్యుతానంద’. తొలి సినిమాలో రొమాంటిక్ డ్రామాకి కామెడీ జత చేసి రచయితగా తన పదును చూపిన శ్రీని అదే ముద్ర తనపై ఉండిపోకూడదని ఈ సినిమాని కొత్త కోణంలో తీర్చిదిద్దాడట. హాస్యపు గుళికలు వేస్తూనే ముగింపులో కన్నీళ్లు తెప్పించే ప్రయత్నం చేసాడట. ఇది చూసిన విజయేంద్ర ప్రసాద్ లాంటి పెద్దాయన ఆడియో వేడుక సాక్షిగా సదరు సన్నివేశం చూసిన వెంటనే కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయని చెప్పుకొచ్చారు. నిన్నటికి నిన్న దర్శకుడు సుకుమార్ సైతం అదే మాట చెప్పారు.
‘ఊహలు గుసగుసలాడే’ స్క్రిప్ట్ చదివిన అనుభవంతో ఈ సినిమా చేయకముందే స్క్రిప్ట్ అడిగి మరీ చదివానన్న సుక్కూ క్లైమాక్స్ చదివినపుడు తన కళ్ళు చెమ్మగిల్లిన ఫోటో తీసి శ్రీనికి పంపారట. మరి ఇదే సీన్ రిపీట్ అయితే రేపు ప్రేక్షకులకి ఏడుపు తప్పదు. నటుడిగా నవ్వులు పూయించిన అవసరాల.. దర్శకుడిగా ఏడిపిస్తున్నాడన్నమాట. అయినా అంతలా శ్రీని ఏం రాశాడబ్బా..?