సినిమాల్లో మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అంటే బాలీవుడ్ స్టార్ హీరో హీరో ఆమిర్ ఖాన్ గుర్తొస్తాడు. తన సినిమాల విషయంలో, తన నటన విషయంలో చాలా పర్‌ఫెక్షన్ చూపిస్తాడు అని అంటారు. ఆయన సినిమాల్లో మనం ఇది చూస్తుంటాం. ఇక దర్శకుల్లో అయితే సుకుమార్‌కు ఆ పేరు పెట్టొచ్చు అంటారు. అంటే ఏ సినిమా చేసినా, సినిమాలో ఏ సీన్ తీస్తున్నా పక్కాగా ఉండేలా చూసుకుంటారు ఆయన. అందుకే ‘పుష్ప’ సినిమా రిలీజ్ ముందు రోజు వరకు ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఉన్నారట.
అయితే ఇది సినిమా అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ దగ్గరే కాదు. సినిమా షూటింగ్‌లోనూ అలానే ఉంటారు. దీనికి తాజా ఉదాహరణ ‘పుష్ప: ది రూల్’ సినిమాలోని ఓ పాట షూటింగ్ సమయంలో జరిగిన విషయాలే. సోషల్ మీడియా సమాచారం ప్రకారం చూస్తే… మన లెక్కల మాస్టారు ఎంత పర్‌ఫెక్షన్ కోసం ట్రై చేస్తారో తెలుస్తుంది. ‘పుష్ప 2’లో ఓ జాతర సాంగ్ ఉందని ఆ మధ్య వార్తలొచ్చాయి. అమ్మవారి తరహా గెటప్‌లో అల్లు అర్జున్ కనిపించబోయేది ఆ సాంగ్‌లోనేనట.
ఆ పాట షూటింగ్ ఇటీవల పూర్తి చేసిందట టీమ్. ప్రముఖ బాలీవుడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య ఆ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారట. తొలుత రెండు లేదా మూడు రోజుల్లోనే పాట అయిపోతుందని టీమ్ ప్లాన్ చేసిందట. దానికి తగట్టే గణేశ్ ఆచార్య టీమ్ కూడా ప్లాన్ చేసుకుందట కానీ ఆ పాట అలా అలా సుమారు వారం తీసుకుంది అని అంటున్నారు. దీంతో పారితోషికం కూడా డబుల్ అయ్యిందని టాక్.
రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్స్‌లో ఆ పాట ఓ వారం పాటు తెరకెక్కించారు అని అంటున్నారు. మరికొందరైతే కొన్ని రోజులు కాదు, ఏకంగా కొన్ని వారాలే పట్టింది అని కూడా అంటున్నారు. స్టెప్పులు మార్చి మార్చి కంపోజ్ చేయడం.. షూట్ దగ్గర బాగా ఆలస్యం జరగడంతో ఇదెక్కడి పర్‌ఫెక్షనిజం బాబోయ్ అని అనుకున్నారట గణేశ్ ఆచార్య. అయితే ఈ కష్టం మొత్తం అవుట్‌పుట్ చూశాక మరచిపోతారు అని అంటున్నాయి చిత్ర వర్గాలు.