సునీల్ తన కెరీర్‌లో చాలా సినిమాలు చేశాడు. సైడ్ క్యారెక్టర్ నుండి మొదలుపెట్టి హీరో అయ్యి.. మళ్లీ ఇప్పుడు రిటర్న్ టు కమెడియన్ స్టేటస్‌కి వచ్చేశాడు. అయితే అన్ని సినిమాలు ఒకెత్తు.. ‘పుష్ప’ సినిమాలో చేసిన మంగళం శ్రీను పాత్ర ఒక ఎత్తు అని చెప్పాలి. అంతలా ఆ సినిమాలో కొత్తగా కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే ఆ సినిమాలో సునీల్ విలనిజాన్ని చూసి.. అందరూ మంత్రముగ్ధులు అవుతారని అనుకున్నారు. పక్క ఇండస్ట్రీల నుండి కూడా పిలుపులు వస్తాయి అన్నారు.
అయితే సినిమా వచ్చి 11 నెలలు అయినా ఇంకా రాలేదు. దీంతో కష్టమేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు సునీల్‌కి పిలుపొచ్చింది. సహాయ నటుడిగా, కమెడియన్‌గా, హీరోగా సునీల్ తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే తెలుసు. డబ్బింగ్ మూలాన తన సినిమాలు పక్క రాష్ట్రాలకు వెళ్లి.. అలా వాళ్లకు తెలిసి ఉండొచ్చు. కానీ మంగళం శ్రీనుగా ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా విలనీ చేశాడు. ఇప్పుడు దాని ఎఫెక్టో, ఇంకొకటో కానీ.. ఓ తమిళ సినిమాలో సునీల్ నటించబోతున్నాడు.
శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మావీరన్’ అనే సినిమాలో సునీల్‌కి ఓ పాత్ర దక్కింది. ఇటీవల చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది కూడా. ‘మావీరన్’లో చిత్రం తెలుగులో ‘మహావీరుడు’ పేరుతో తెరకెక్కుతోంది. యోగి బాబుతో ‘మండేలా’ అనే సినిమా తీసిన మడోనా అశ్విన్ ‘మావీరన్’కి దర్శకుడు. ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ కథానాయిక. ఈ సినిమాలోనే సునీల్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడట.
సునీల్ పాత్ర తెలుగు, తమిళం వెర్షన్లలోనూ ఉంటుందని సమాచారం. దీంతో సునీల్‌కి తమిళంలో వెల్కమ్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి మొదలైంది. ‘పుష్ప’ సినిమా తర్వాత సునీల్‌కి బాలీవుడ్ నుండి కూడా కాల్స్ వస్తున్నాయని అన్నారు. అయితే సినిమా అవకాశాలు ఏమీ రాలేదు. ఇప్పుడు తమిళం నుండి తొలిసారి నాన్ తెలుగు ఆఫర్ వచ్చింది. మరి దీన్ని సునిల్ ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.