ఈ మధ్యకాలంలో అమెజాన్ ప్రైమ్ విడుదల చేస్తోన్న వెబ్ సిరీస్ లు వివాదాలపాలవుతున్నాయి. రీసెంట్ గా ‘తాండవ్’ సిరీస్ పై పెద్ద దుమారం చెలరేగింది. అలానే ‘మీర్జాపూర్’ సిరీస్ పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.లక్నో, మీర్జాపూర్‌లో ఇదివరకే రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా.. తాజాగా ఈ సిరీస్ పై మరో కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ ప్రాంతాన్ని హింసాత్మకంగా చూపించడంతో అక్కడ నివసించే ఓ వ్యక్తి ఈ వెబ్ సిరీస్ మీద పిల్ దాఖలు చేశాడు.
దీంతో సుప్రీం కోర్టు గురువారం నాడు మీర్జాపూర్ టీమ్ కు, అమెజాన్ ప్రైమ్ వీడియోకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఓటీటీలో ఇష్టానుసారంగా వస్తోన్న సినిమాలు, వెబ్ సిరీస్ కంటెంట్ ను కంట్రోల్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. అప్పట్లో ఈ సిరీస్ మీద మీర్జాపూర్ ఎంపీ అనుప్రియ పటేల్ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోలో మీర్జాపూర్ సిటీ ఎంతో ప్రశాంతంగా ఉందని.. కానీ వెబ్ సిరీస్ లో ఈ నగరాన్ని హింసాత్మకంగా చూపించి దాని ప్రతిష్టను దిగజార్చారని మండిపడ్డారు. రెండు సీజన్లుగా వచ్చిన ఈ సిరీస్ లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, విక్రాంత్ మాస్సే ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్ కు కరణ్ అన్షుమన్, గుర్మీత్ సింగ్‌లు దర్శకులుగా పని చేశారు.