‘కంగువ’ (Kanguva) నుండి చాలా వేగంగానే కోలుకున్నాడు సూర్య. మామూలుగా అయితే ఇతర హీరోల అలాంటి డిజాస్టర్ నుండి బయటకు రావడానికి చాలా సమయం తీసుకుంటారు. సూర్య ఆ సినిమాను వదిలేసినట్లే మనమూ ఆ విషయం వదిలేద్దాం. ఇప్పుడు కొత్త సినిమాల గురించి చూద్దాం. 44వ సినిమాను కార్తిక్ సుబ్బరాజుతో (Karthik Subbaraj) చేస్తున్న సూర్య(Suriya).. 45వ సినిమాను ఆర్జే బాలాజీ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ రెండు సినిమాల పనులు శరవేగంగా సాగుతున్న ఈ సమయంలోనే మరో సినిమాను ఓకే చేశాడు అనే మాట వినిపిస్తోంది.
Suriya
తెలుగు హీరోలతో విజయాలను, ఇతర భాషల హీరోలతో భారీ విజయాలను అందుకోవడంలో సిద్ధహస్తుడైన వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో సూర్య 46వ సినిమా ఉంటుంది అని వార్తలొస్తున్నాయి. వీటిపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ.. ఆ సినిమా కథ ఇదే అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ప్రేమకథలు తీసి మెప్పించిన వెంకీ అట్లూరి అనూహ్యంగా విద్య – వ్యాపారం కాన్సెప్ట్‌లో ధనుష్‌తో (Dhanush) ‘సార్’ (Sir) అనే సినిమా చేసి మెప్పించారు.
ఆ తర్వాత బ్యాంకు లావాదేవీల లొసుగుల నేపథ్యంలో దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) సినిమా చేసి భారీ విజయం అందుకున్నారు. ఇప్పుడు ఓ కారు జీవితం చుట్టూ ఓ కథ రాసుకొని సూర్యతో తీయబోతున్నారు అని సమాచారం. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లోనే తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మారుతి కారును కథా వస్తువుగా ఎంచుకున్నాడు. ఆ కారు మన దేశానికి ఎలా వచ్చింది? దాని నేపథ్యం ఏమిటి? అనే అంశాలతో వెంకీ అట్లూరి కథ రాసుకున్నారట.
మరి ఈ చరిత్రను ఎలా చూపిస్తారు అనేది చూడాలి. గతంలో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో ‘డెక్కన్ ఎయిర్‌లైన్స్’ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్ జీవితాన్ని చూపించారు. ఇప్పుడు మారుతి కారు గురించి చెప్పబోతున్నారు. మరి ఈ సినిమా సూర్యకు ఎంతటి పేరు తీసుకొస్తుందో చూడాలి. ఎందుకంటే ‘సూరరై పొట్రు’ / ఆకాశం నీ హద్దురా’కు విమర్శకుల ప్రశంసలు, అవార్డులు అందుకున్నాడు సూర్య.